3, జులై 2017, సోమవారం

నొప్పింపక-తానొవ్వక

మనం చాలామందిని చూస్తూ ఉంటాం - ఇతరులను ఎట్టి పరిస్థితులలోనూ కష్టపెట్ట కూడదని తాము మాత్రం వారివలన చాలా కష్టపడుతూ ఉంటారు. ఈ లోకంలో అలా బ్రతకటం చాలా కష్టం. మానవుడు సంఘజీవి. మనందరం పరస్పర ఆధారితులం. అందుకే ఇతరులను కష్టపెట్టకపోవటం ఎంత ముఖ్యమో మనం కష్టపడకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. అందుకే సుమతీశతకంలో "పరులను నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ" అని చెప్పబడింది. అలాగే భగవద్గీతలో కూడా భక్తునికి ఉండవలసిన లక్షణాలలో "యస్మాన్నోద్విజతే లోకాః లోకాన్నోద్విజతేచయః" - లోకాన్ని కష్టపెట్టకుండా, లోకం వలన తాను కష్టపడకుండా ఉండటం ఒక లక్షణంగా చెప్పబడింది.

వెనకటికి ఒక ఊరిలో ఒక సాధువు ఆథ్యాత్మిక ఉపన్యాసం చేస్తూ అహింస గురించి ప్రముఖంగా ప్రస్తావించి అందరిలో పరమాత్ముడు ఉంటాడు కనుక ఎవరినీ హింసించకుండా ఉండటం ఎంత ముఖ్యమో చెప్పారుట. ఆయన అక్కడనుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒక పెద్ద బలిష్టమైన సర్పం ఆయనకు ఎదురుపడి, "స్వామీ మీరు ఎవరినీ హింసించకూడదు అని చెప్పారు కదా, నిజంగా అదే సరైన పనా?" అని అడిగింది. అప్పుడు ఆ స్వామి "అవును. ఇకనుంచి నువ్వు కూడా ఎవరినీ కరవకుండా ఉండగలవా?" అని ప్రశ్నిస్తే ఆ సర్పం అందుకు అంగీకారం తెలిపింది. ఆ సర్పాన్ని ఆశీర్వదించి ఆ స్వామి అక్కడనుండి వెళ్ళిపోయారు.

అప్పటినుండి ఆ సర్పం ఎవరినీ కరవటం మానేసింది. ఇది గమనించిన ఊరివారు దానికి భయపడటం మానేసి ఎదురు దానినే రాళ్ళతో కొట్టటం, రకరకాలుగా హింసించటం మొదలుపెట్టారు. అయినా అది స్వామికి ఇచ్చిన మాటకు కట్టుపడి ఎవరికీ ఎదురు తిరగకుండా అలాగే బాధలను భరిస్తోంది. కొన్నాళ్ళకు ఆ స్వామి మళ్ళీ అదే ఊరిగుండా వెళ్ళడం తటస్థించింది. అప్పటికి చిక్కి శల్యమై వళ్ళంతా గాయాలతో ఉన్న ఆ సర్పాన్ని చూసి స్వామి మనసు ద్రవించింది. దానిని దగ్గరకు పిలిచి "ఎందుకు నీకీ దురవస్థ?" అని కరుణ నిండిన హృదయంతో ప్రశ్నించారు. అందుకు ఆ సర్పం "స్వామీ! మీకిచ్చిన మాట ప్రకారం నేను ఎవరినీ కరవటం లేదు. అందుకే నాకీ దురవస్థ" అని సమాధానమిచ్చింది. అప్పుడు ఆ స్వామి "నేను నిన్ను కరవద్దన్నాను కానీ బుస కొట్టవద్దని చెప్పలేదు కదా. ఎదుటివారిని హింసించకపోవటం ఎంత ముఖ్యమో మనలను మనం కాపాడుకోవటం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే వారిలో ఉన్న పరమాత్ముడే నీలో కూడా ఉన్నాడు కదా!" అని సమాధానమిచ్చారు. అప్పటినుండి ఆ సర్పం ఎవరైనా తన మీదకు రాగానే బుసకొట్టి వారినుండి తనను తాను రక్షించుకోవటం మొదలుపెట్టింది.