30, జులై 2015, గురువారం

కారు చీకటిలో కాంతి రేఖ

అది 1990వ సంవత్సరం. గుంటూరు, కృష్ణా జిల్లాలను అతలాకుతలం చేసిన పెను తుఫాను తీరం చేరుతున్న సమయం. నేను బయటినుండి మా ఇంటి వైపుగా నడుస్తున్నాను. అప్పటికే కరెంటు పోయి చిమ్మచీకటి అలుముకుంది. అయినా తెలిసిన దారే కనుక అలాగే తడుముకుంటూ వెళ్తున్నాను. సరిగ్గా మా ఇంటి చివర మలుపు తిగుతుండగా ఒక్కసారిగా పెద్ద మెరుపు మెరిసింది. తరువాతి అడుగు వేయటానికి కాలు ఎత్తిన నేను, ఆ వెలుగులో అక్కడి బురదను చూసి చటుక్కున కాలు వెనక్కు తీసుకుని ప్రక్కనుంచి వెళ్ళాను. అక్కడ ఎంత బురదగా ఉందంటే, అందులో కాలు వేస్తే ఎక్కడో తేలేవాడ్ని. ఆ చీకట్లో, గాలివానలో నా అరుపులు కూడా ఎవరికీ వినిపించేవి కావు. సందర్భం గుర్తులేదు కానీ ఇలాగే ఇంకో ఒకటి రెండుసార్లు కూడా జరిగింది.

నేను డిగ్రీలో ఉండగా తరచుగా కాలేజి ఎగ్గొట్టి సినిమాలు చూస్తూ ఉండేవాడిని. అలా ఒకరోజు కాలేజీకని బయలుదేరి రోడ్డుమీద నడుస్తూ, ఇవాళ ఏ సినిమాకి వెళదామా అని ఆలోచించుకుంటూ ఉండగా, ఒక్కసారిగా నాకు చాలా ఆవేదన కలిగింది. శ్రీగురుదేవులను మనస్సులోనే ఇలా ప్రశ్నించుకున్నాను. "నేను మామూలు బురదలో కాలు వేసి పడబోతుంటేనే అలా వెలుగు చూపించి నన్ను కాలు జారకుండా ఎన్నోసార్లు కాపాడారు కదా, మరి ఇలా క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు చూస్తూ జీవితం పాడు చేసుకుంటూ ఉంటే ఎప్పుడూ అడ్డుకోరు ఎందుకు?" అని.

వెంటనే నా మనసులోనుండే నాకు సమాధానం వినిపించింది. "నేను నిన్ను ఎప్పుడూ బురదలో కాలు వేయకుండా ఆపలేదు, అలాగే నిన్ను బలవంతంగా వెనక్కు లాగలేదు. నేను కేవలం చీకట్లో ఉన్న నీకు అక్కడ బురద ఉందని మాత్రమే చూపించాను. బురదలో కాలు వేస్తే కలిగే పరిణామం ఏమిటో నీ బుద్ధిలో బాగా నాటుకుని ఉంది కాబట్టి, నీ అంతట నువ్వే కాలు వెనక్కు తీసుకున్నావు. మరి అలాగే నువ్వు క్లాసులు ఎగ్గొట్టి సినిమాకు వెళ్ళిన ప్రతిసారీ నేను నీకు నీ తప్పును ఏదో ఒక రూపంలో సూచిస్తూనే ఉన్నాను. కానీ ఆ తప్పువల్ల కలిగే పరిణామం నీ బుద్ధిలో బలంగా నాటుకోని కారణంగా నువ్వు నా సూచనలను పట్టించుకోకుండా నీ తప్పును కొనసాగిస్తూ వచ్చావు." అని.

"నిజంగా దేవుడనేవాడు ఉంటే నా తప్పులను ఎందుకు అడ్డుకోడు?" అని ప్రశ్నించే వారందరూ ఒక్కసారి వారి అంతరాత్మను తరచి చూసుకుంటే భగవంతుడు ఎన్ని విధాలుగా మన తప్పులను తెలియజేస్తున్నాడో మనకే తెలుస్తుంది. కానీ మనలోని బలహీనతల కారణంగా మనం ఆ సూచనలను పట్టించుకోకుండా, చివరికి ఆ తప్పుల ఫలితాలను అనుభవించాల్సి వచ్చిన సందర్భంలో భగవంతుని నిందిస్తాం.

భగవంతుడు/గురుదేవుడు ఒక మార్గదర్శి మాత్రమే. అయన చూపించిన మార్గంలో పయనం చేయటం పూర్తిగా మన కర్తవ్యమే. మన పిల్లలు బాగా పసివారిగా ఉన్నప్పుడు వారిని అనుక్షణం కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాం. కానీ వారు కాస్త పెద్దవారు అయిన తరువాత మనం కేవలం సలహాలనే ఇస్తాం కానీ వారిని ప్రతి విషయంలో అడ్డుకోము. ఎందుకంటే వారి తప్పులనుంచి వారు కూడా నేర్చుకోవాలని భావిస్తాం. కానీ ఎంత పెద్దవారైనా, ఎన్ని తప్పులు చేసినా, వాళ్ళకు దాటలేని అపాయాలు ఎదురైనప్పుడు మాత్రం మనం తప్పకుండా రక్షణకు పరుగు పెడతాం. అలాగే భగవంతుడు కూడా మన తప్పులనుండి నేర్చుకోవటానికి మనకు అనేక అవకాశాలు ఇస్తాడు. అంతమాత్రం చేత మనం నిజంగా ప్రమాదంలో పడినప్పుడు మాత్రం కేవలం మార్గదర్శనమే చేయాలని చూస్తూ ఊరుకోడు. తప్పకుండా మనలను రక్షిస్తాడు.

అలాంటి సంఘటనలు నా జీవితంలో ఎన్నో! మచ్చుకకి ఒకటి - న్యూయార్క్ లో ఒక ఎలక్ట్రానిక్స్ షాపుకి వెళ్ళి, ఎస్కలేటర్ మీద నుంచుని కూడా, నాకున్న సహజ కుతూహలంతో ప్రక్కకు వంగి క్రింద ఉన్న ఏవో అట్టపెట్టెల మీద పేర్లు చదువుతున్నాను. ఉన్నట్టుండి ఎవరో నా తలను వెనక్కు లాగినట్టు అయింది. వెనకాల ఎవరూ లేరు కానీ ఒక్క క్షణం నా తల అలా వెనక్కు తీయడం ఆలస్యమై ఉంటే, ఎస్కలేటర్ ప్రక్కనే ఉన్న సీలింగుకి నా తల గట్టిగా కొట్టుకుని బుర్ర పగిలి ఉండేది. 

21, జులై 2015, మంగళవారం

ఆథ్యాత్మికం - సోషలిజం

కొంతమంది "చాతుర్వర్ణం మయా సృష్టం" అనే గీతా వాక్యాన్ని ఉటంకించి, భగవంతునికే భేద భావనను అంటగట్టి ఆ సాకుతో ఇతరులను నీచంగా చూస్తారు. కానీ అదే భగవద్గీతలో ఎన్నో సందర్భాలలో సమానత్వాన్ని గీతాచార్యుడు ప్రబోధించిన విషయాన్ని వీరు పట్టించుకోరు.

"విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే, గవి, హస్తిని, శునిచైవ, శ్వపాకేచ పండితాః సమదర్శనః" అనే గీతావాక్యం ద్వారా విద్యా వినయ సంపద కలిగిన బ్రాహ్మణునియందు, గోవుయందు, ఏనుగునందు, కుక్కయందు, ఆ కుక్క మాంసం వండుకు తినేవానియందు పండితుడైనవాడు సమదృష్టి కలిగి ఉంటాడని శ్రీకృష్ణభగవానుడు నొక్కి వక్కాణిస్తున్నాడు. ఇలా సమాజంలో విభిన్న స్థాయిలలో ఉన్నారనుకునే వారినేకాక అనేక ఇతర రకాలైన ప్రాణులను కూడా సమాన దృష్టితో చూసేవాడే పండితుడు.

ఇక "సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపిచ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే" అనే శ్లోకం ద్వారా నీకు స్నేహితులు, మిత్రులు, శత్రువులు, నిన్ను పట్టించుకోనివారు, మిత్రులూ శత్రువులూ కాక మధ్యస్తంగా ఉండేవారు, నిన్ను ద్వేషించేవారు, నీకు బంధువులు, సాధువులు, పాపులు - ఇలా అన్ని రకాల మనోభావాలు, సంబంధాలు ఉన్నవారి పట్ల సమభావం కలిగి ఉండటమే విశేషలక్షణంగా వర్ణించబడింది. ఇంకా "సమత్వం యోగ ఉచ్యతే" - సమత్వమే యోగము అని కూడా చెప్పబడింది.

వివేకచూడామణిలోని "జాతి నీతి కుల గోత్ర దూరగం, నామ రూప గుణ దోష వర్జితం, దేశ కాల విషయాతి వర్తియత్, బ్రహ్మ తత్త్వమసి భావయాత్మని" అనే శ్లోకాన్ని మా గురుదేవులైన శ్రీ బాబూజీ మహారాజ్ వారు తరచుగా ప్రస్తావిస్తూ ఉండేవారు. అలాగే ఆథ్యాత్మికాన్నిమించిన సోషలిజం ఎక్కడా లేదని కూడా చెప్పేవారు.

ఈ సృష్టిలోని సమస్త జీవులలో, వస్తువులలో తానే నిండి ఉన్నానని విభూతి యోగంలో గీతాచార్యుడు బోధించినప్పుడు అర్జునుడు ఆ విశ్వరూపాన్నిదర్శించాలని ఆకాంక్షించాడు. అప్పుడు శ్రీ కృష్ణ భగవానుడు "అయితే ఇదిగో నా విశ్వరూపాన్ని చూడు" అన్నాడు. కానీ అర్జునునికి ఏమీ కనిపించలేదు. అప్పుడు భగవానుడే కరుణించి "ఈ నీ చక్షువులతో నా విశ్వరూపాన్ని దర్శించలేవు. ఇదిగో నీకు దివ్య చక్షువులను ప్రసాదిస్తున్నాను. వాటితో నా విశ్వరూపాన్ని దర్శించు" అని అర్జునునికి దివ్య దృష్టిని ప్రసాదించి తన విశ్వరూపాన్ని దర్శింపచేసాడు. అప్పుడు అర్జునునికి అంతవరకూ తన ఎదుటనున్న కృష్ణుడు, చుట్టూ ఉన్న పెద్ద సైన్యం, ఇంకా విశ్వంలోని సమస్త ప్రాణులు, చివరికి తనతో సహా మొత్తం ఆ విశ్వరూపంలోనే కనిపించారు.

ఈ సందర్భంలో "సర్వ భూతస్థ మాత్మానం, సర్వ భూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః" - సమదర్శనుడైన యోగి సర్వ ప్రాణులలో ఉన్నది తానేనని, తనలోనే సర్వ ప్రాణులు ఉన్నాయని ఆత్మజ్ఞానంతో దర్శించగలుగుతాడని తెలిపే గీతావాక్యానికి అర్థంగా నిలిచాడు అర్జునుడు. అయితే ఇక్కడ "కృష్ణుడు అంతకుముందు మాములుగా ఉండి అప్పుడే విశ్వరూపాన్ని పొందాడా?" అంటే "కాదు" అనే సమాధానం వస్తుంది. ఆయన ఎప్పుడూ మార్పు లేకుండా విశ్వరూప స్థితిలోనే ఉన్నాడు. ఇక్కడ మారింది అర్జునుని దృష్టి మాత్రమే.

ఇలా మన దృష్టిని ఆథ్యాత్మిక సాధన ద్వారా మార్చుకోగలిగిన నాడు, మా ఆశ్రమ నిత్య ప్రార్థనలో భాగమైన "మానవునికీ మానవునికి మధ్య భేదబుద్ధి నశించి, సర్వ జీవులు సమభావముతోనూ ప్రేమ దృష్టితోనూ మెలగుదురు గాక. లోకములన్నియు శాంతి సౌఖ్యములతో వర్ధిల్లును గాక." అనే వాక్యాలు నిత్య సత్యాలుగా నిలుస్తాయి. ఇంతకు మించిన సోషలిజం ఎక్కడ ఉంటుంది?

6, జులై 2015, సోమవారం

త్యాగాత్ శాంతిరనంతరం



మనం పూజలు కానీ, వ్రతాలు కానీ, జపం కానీ రోజూ చేసుకునే అలవాటు/అభ్యాసం అయితే అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం. అయితే అలా కేవలం అభ్యాసంగా కాకుండా వాటిలోని అర్థాన్ని తెలుసుకొని చేయటం ఉత్తమమని "శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్" అని భగవద్గీత బోధిస్తోంది.  దీనినే "తెలిసి రామ చింతన చేయమని" శ్రీ త్యాగరాజ స్వామివారు బోధించారు. 

అయితే కేవలం అర్థం తెలుకున్నంత మాత్రాన సరిపోదు, దానిమీద నీ మనస్సునుంచి నీ ధ్యానంలో నిలుపుకుని చేయాలని "జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే" అని కూడా చెబుతోంది. 

కానీ, అర్థం తెలుసుకొని, ధ్యాస నిలిపి సత్కర్మలు ఆచరించినప్పటికీ వాటిని ఏదో ప్రయోజనం ఆశించి చేయటం వలన అవి కామ్య కర్మలుగా మారి చివరికి బంధాన్నే కలిగిస్తాయి. అందుకనే ధ్యానం కన్నా కూడా కర్మఫల త్యాగం గొప్పదని "ధ్యానాత్ కర్మఫల త్యాగః" అని చెప్పబడింది. 

ఇక అలా ఫలితాన్ని భగవంతునికే విడిచిపెట్టి సత్కర్మలను ఆచరించటం వలన మనకు శాశ్వతమైన శాంతి లభిస్తుంది. దీనినే భగవద్గీత "త్యాగాత్ శాంతిరనంతరం" అని నొక్కి వక్కాణిస్తోంది. 

మా గురుదేవులైన శ్రీబాబూజీ మహరాజ్ వారు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు - చెరువు దగ్గరకు ఒక గ్లాసు తీసుకువెళితే నీకు గ్లాసుడు నీళ్ళే వస్తాయి. అలాగే చెంబుతో వెళ్ళిన వాడికి చెంబుడు నీళ్ళు, బిందెతో వెళ్ళిన వాడికి బిందెడు నీళ్ళు లభిస్తాయి. కాని ఏమీ తీసుకువెళ్ళకుండా తానే వెళ్ళి చెరువులో మునిగిన వాడికి ఆ చెరువంతా తనదే అవుతుంది. చూసారా ఫలితం ఆశించని వాడికి ఎంతటి ఫలితం దక్కుతుందో? ఇక వాడి మనసులో అశాంతికి తావెక్కడిది?