2, జూన్ 2015, మంగళవారం

సత్య గురుదేవులు vs. నకిలీ గురువులు


 ఈనాటి సమాజంలో సహజంగా చాలామందికి కలిగే ప్రశ్న ఇది. “ఇంతమంది నకిలీ గురువులను చూస్తున్నాం కదా. ఇందులో సత్య గురుదేవులను గుర్తించటం ఎట్లా?” అని. కొంతమంది అయితే ఇంకో అడుగు ముందుకు వేసి “అసలు మాకు గురువుల వ్యవస్థ మీదే నమ్మకం పోయింది. మేము సత్య గురువులను వెదికి ఆశ్రయించవలసిన పని ఏముంది?” అంటారు.

ఇప్పుడే కాదు, ఎన్నో దశాబ్దాల పూర్వమే మా గురుదేవులైన శ్రీబాబూజీ మహారాజ్ వారిని ఎంతోమంది ఇలా ప్రశ్నించి సందేహ నివృత్తి చేసుకున్నారు. ఇలాంటి ప్రశ్న వేసిన వారిని మా గురుదేవులు తిరిగి ఒక ప్రశ్న అడిగేవారు. నీకు ఒక రోగం వచ్చిందనుకో. “బజారులో నకిలీ మందులు బాగా ఎక్కువ అయిపోయాయి” అని చెప్పి మందు తీసుకోవటం మానేస్తావా? అలాగే నకిలీ వైద్యులు ఎక్కువగా ఉన్నారని వైద్యం చేయించుకోవటం మానేస్తావా? నీకు రోగం తగ్గటం ముఖ్యం. అందుకని, కష్టపడి వెదికి అయినా సరే మంచి వైద్యుని సంప్రదించి అతను వ్రాసిన మందులను కూడా మంచివి వెదికి వేసుకుంటావు కదా. అలాగే భవరోగంతో బాధపడే ప్రతి ఒక్కరూ సత్య గురుదేవులను వెదికి ఆశ్రయించి తరించటానికి ప్రయత్నించవలసిందే.

సత్య గురుదేవులు ఎప్పుడూ నీ దగ్గర నుండి ఏమీ ఆశించరు. ఎందుకంటే పూర్ణ స్వరుపులైన వారికి కొత్తగా పొందవలసింది ఏమీ లేదు. వారు మననుంచి ఆశించేది మన భక్తిని, పరిపూర్ణ విశ్వాసాన్ని మాత్రమే. అది కూడా మనం తరించడానికే కానీ వారికి ఒరిగేది ఏమీ ఉండదు. అలా కాక కొందరు గురువులు నమస్కారానికి, పూజకి, సంభాషణకి ఇలా ప్రతి దానికి ఒక వెల నిర్ణయించి వసూలు చేస్తూ ఉంటారు. ఇలాంటి వారిని మా గురుదేవులు “చేతిలో రూపాయి – చెవిలో మంత్రం గురువులు” అనేవారు.

నా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఒక పద్యం చదువుతూ ఉండేది.
ఈవికాశించు గురువును,
నా వద్దొక కాసు లేదు
పోపో మనెడి శిష్యుడును
కేవల హీనాత్ములనుచు కీర్తింపతగున్
ఇది విని నేను అనుకునే వాడిని – ఇలాంటి వారిని కీర్తించటం కూడా ఎందుకు దండగ అని.

ఇక అసలు గురువులతో పని ఏముంది? మనమే నేరుగా భగవంతుని చేరలేమా? అనే ప్రశ్నకు వస్తే మనకు శ్రీనామదేవుల వారి చరిత్ర ఇందుకు చక్కని సమాధానం చూపిస్తుంది. మీలో ఎవరైనా చక్రధారి సినిమా చూసి ఉంటే అందులో కూడా ఈ చరిత్రను చూపించటం జరిగింది. శ్రీనామదేవుల వారు స్వయంగా శ్రీపాండురంగని దర్శించి, ప్రతిరోజూ  స్వామితో సంభాషిస్తూ, స్వయంగా స్వామికి నివేదన తినిపించగలిగిన పరమ భక్తులు. కానీ శ్రీజ్ఞానదేవుల వారి ఆదేశంతో గోరా కుమ్హార్ అనే భక్తుడు వారిని పరీక్షించి ఇది ఇంకా పచ్చి కుండే అని నిర్ధారిస్తాడు. అది విని క్రుద్ధులైన శ్రీనామదేవుల వారు పాండురంగని ఆలయంలో ప్రవేశించి స్వామి వద్ద తమ ఆవేదనను వెలిబుచ్చితే అప్పుడు స్వామే స్వయంగా వారికి తెలియజేస్తారు – “నీవు ఎంతటి పరమ భక్తుడవైనా ఒక గురువుని ఆశ్రయించి జ్ఞానాన్ని పొందనిదే పరిపూర్ణుడవు కాలేవు, ముక్తిని పొందలేవు” అని.

మరి సత్య గురుదేవులని తెలుసుకోవటం, వారిని ఆశ్రయించటం ఎట్లా? నీ భక్తి, ఆవేదన గాఢమైనప్పుడు భగవంతుడే సత్య గురుదేవుల రూపంలో నీ వద్దకు నడచి వస్తాడు. “అప్రత్యక్షో మహాదేవః సర్వేషాం ఆత్మ మాయయా! ప్రత్యక్షో గురు రూపేణ వర్తతే భక్తి సిద్ధయే!!” అయితే అట్టి గురుదేవులు లభించినప్పుడు కూడా ఇంకా మూర్ఖంగా ప్రవర్తించి వారిని కోల్పోకుండా సరియైన సమయంలో వారిని గుర్తించి ఆశ్రయించినప్పుడే మనం ప్రయోజనాన్ని పొందగలుగుతాం.


అలా కాకుండా నేను భగవంతునే నేరుగా చేరుకుంటాను, ఈ గురువుల అవసరం ఏముంది అని వాదించేవాళ్ళు - నాకు ఎంతో చదువు వచ్చు, లేదా నా ఇంట్లో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఇక మా పిల్లలకు బడి ఎందుకు అని మాన్పిస్తున్నారా? తమకు రోగం వస్తే వైద్యుడు ఎందుకు అని తమ వైద్యం తామే చేసుకుంటున్నారా? తమ ఇల్లు తామే కట్టుకుంటున్నారా? తమ భోజనం తామే పండించుకుంటున్నారా? తమ బట్టలు తామే నేసుకుంటున్నారా? ఇలా జీవితంలో ప్రతి దానికీ ఇతరుల మీద ఆధారపడి, వారి సహాయాన్ని తీసుకునే మానవులు, భగవంతుని విషయం వచ్చేసరికి మాత్రం అంతా తమకే తెలుసునని, ఇక గురువుల అవసరం ఏమున్నదని అజ్ఞానంతో ప్రశ్నిస్తారు.