25, ఫిబ్రవరి 2015, బుధవారం

ప్రకృతి - పురుషుడు

ప్రకృతి రెండు రకాలని భగవద్గీతలోని ఏడవ అధ్యాయంలో గీతాచార్యుడు చెప్పటం జరిగింది. అవి పరాప్రకృతి, అపరాప్రకృతి. ఈ పంచభూతాలు, వాటితో తయారైన కనపడే ప్రపంచమంతా, ఇంకా జీవులలో అంతర్గతంగా ఉండే మనస్సు, బుద్ధి, అహంకారాలు ఇవి అపరాప్రకృతి అని; ఇక ప్రతి జీవిలోనూ కూటస్థ చైతన్య రూపంలో ఉండే ఆత్మవస్తువు పరాప్రకృతి అని చెప్పబడింది.

అలాగే పురుషుడు మూడు రకాలని పదిహేనవ అధ్యాయంలో చెప్పబడింది. నిరంతరం పుడుతూ, పెరుగుతూ, చస్తూ పరిణామం చెందుతూ ఉండే ఈ కనబడే ప్రపంచమంతా క్షరపురుషుడని, ఈ జీవులలో కూటస్థ చైతన్య రూపంలో ఉండి నాశనంలేని ఆత్మవస్తువు అక్షరపురుషుడని చెప్పబడింది. అయితే విశ్వమంతా నిండి ఉండి అవ్యయుడై ఈ లోకాలన్నింటినీ నిర్వహిస్తున్న తాను ఈ ఇద్దరు పురుషులకంటే ఉత్తముడైన పురుషోత్తముడనని గీతాచార్యుడు చెప్పటం జరిగింది.

ఈ విషయాలను మా గురుదేవులైన శ్రీబాబూజీ మహారాజ్ వారు ఒక చక్కని తేలికైన ఉదాహరణ ద్వారా వివరించారు. ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. ఒక కుండలో నీరు ఉన్నదనుకోండి, ఆ నీటిలో చంద్రుని ప్రతిబింబం మనకు గోచరిస్తుంది. కుండలోని నీరు ఉన్నంతవరకు చంద్రుడు వేరుగా, ప్రతిబింబం వేరుగా కనిపిస్తాయి. అదే నీరు తీసివేసామనుకోండి, ఆ ప్రతిబింబం చంద్రబింబంలో లయించిపోతుంది.

ఇక్కడ ఆ కుండ మన శరీరం. ఇక నీరేమో మనస్సు. చంద్రుడు పరమాత్మ, నీటిలో కనిపించే చంద్రుని ప్రతిబింబం జీవాత్మ. ఇక్కడ కుండ/శరీరం, నీరు/మనస్సు - అపరాప్రకృతి లేదా క్షర పురుషుడు. అలాగే ప్రతిబింబం/ఆత్మ - పరాప్రకృతి లేదా అక్షర పురుషుడు. ఇక చంద్రుడు/పరమాత్మ - పురుషోత్తముడు. కుండలో నీరున్నంతవరకూ, బింబ ప్రతిబింబాలు వేరువేరుగా కనపడినట్లు, మనకు మనస్సు ఉన్నంతవరకూ జీవాత్మ పరమాత్మలు వేరువేరుగా కనిపిస్తారు. ఎప్పుడైతే ఆ మనస్సు లయం అయిపోతుందో అప్పుడు శరీరం అలాగే ఉన్నా, జీవాత్మ పరమాత్మలో లయించిపోతుంది. అదే జీవన్ముక్త స్థితి. మా గురుదేవులు ఎప్పుడూ చెప్పేవారు - ముక్తి అంటే బ్రతికి ఉన్నప్పుడే అనుభవించాలి కానీ, చచ్చిపోయిన తరువాత ఏమీ ఉండదు, ఎత్తిపోతలే అని.

అయితే ఈ మనస్సు ఎలా లేకుండా పోతుంది అంటే - అసలు మనస్సు అంటే సంకల్పాల సమూహం. మనలో సంకల్పాలు లేకుండా పొతే ఇక మనస్సుకు ఉనికి లేదు. అలా సంకల్పాలు లేకుండా పోవటానికే మనం సాధన చేయాలి. అది ఎలా చేయాలో భగవద్గీతలో అనేక చోట్ల చెప్పబడింది. మరో సందర్భంలో చెప్పుకుందాం.

21, ఫిబ్రవరి 2015, శనివారం

శివునాజ్ఞ లేనిదే

శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా, మరి లోకంలో ఇంతమంది ఇన్ని నేరాలు, ఘోరాలు ఎలా చేయగలుగుతున్నారు? వారందరికీ శివునాజ్ఞ ఉన్నదా? అని చాలామంది మా గురుదేవులైన శ్రీబాబూజీ మహారాజ్ వారిని అడిగేవారు.

ముందుగా మనం జంతువుల విషయం చూస్తే - ఆహారం, నిద్ర, భయం, మైధునం ఇవన్నీ అన్ని జీవులకు సహజసిద్ధమైనవి. ఏ జంతువైనా వేరే జంతువును కానీ, మనిషిని కానీ దాడి చేసి గాయపరచింది అంటే, దానికి కారణం ఈ నాలుగింటిలో ఏదో ఒకటి అయి ఉంటుంది. ఇవి నాలుగూ భగవంతుని వలన జీవులందరికీ ప్రసాదించబడినవి కనుక ఈ విషయంలో ఆయా జీవులు చేసే పనులన్నీ భగవంతుని ఆజ్ఞ ప్రకారమే జరుగుతున్నాయని మనం విశ్వసించవచ్చు. ఇక వరదలు, భూకంపాలు, తుఫానులు మొదలైన ప్రకృతి భీభత్సాలన్నీ భగవంతుడు కల్పించిన ప్రకృతి నియమాలకు లోబడే సంభవిస్తాయి కనుక అవి కూడా భగవంతుని ఆజ్ఞకు లోబడే ఇవన్నీ చేస్తున్నాయని మనం నమ్మవచ్చు.

అయితే భగవంతుడు ఈ ప్రకృతికి, జంతువులకి ఇవ్వని బుద్ధి అనే పరికరాన్ని, విచక్షణా జ్ఞానాన్ని మనుషులకు మాత్రమే ఇచ్చాడు. మిగిలిన ప్రాణులన్నీ ప్రకృతిగతంగా ప్రవర్తిస్తాయి తప్పితే, తాము చేసే పనుల మంచి చెడ్డలను విచారించి నిర్ణయించుకునే శక్తి వాటికి లేదు. అందుకే అవి శివునాజ్ఞ ప్రకారం ప్రవర్తిస్తున్నాయని మనం భావించగలం. అయితే మనిషికి విచారించి నిర్ణయించగలిగే బుద్ధిని ఇచ్చిన భగవంతుడు, తద్వారా మరే జీవికీ లేని స్వేచ్ఛను ప్రసాదించాడు. కానీ మనిషి ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ తన స్వార్థం కొరకు మతం పేరున, కులం పేరున, ప్రాంతం పేరున, ఇంకా అనేక కుంటిసాకులు చూపి ఇతరులకు హాని కలిగిస్తున్నాడు.

ఇతర జీవులకు లేని స్వేచ్ఛను మనిషికి ఇవ్వటం శివునాజ్ఞయే కానీ, ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ మనిషి సాగించే మారణహోమం శివునాజ్ఞ కాదు. మా గురుదేవులు ఇదే చెప్పేవారు. తప్పు చేసే మానవులు తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి భగవంతుడ్ని అడ్డు పెట్టుకుంటారు కానీ, నిజంగా భగవంతుడే అన్నీ చేయిస్తున్నాడని మనస్పూర్తిగా నమ్మినవారు ఏ తప్పూ చేయలేరని.

18, ఫిబ్రవరి 2015, బుధవారం

తపస్సు - ప్రార్థన

సాధారణంగా మనం తపస్సు అంటే ఏ అడవికో వెళ్ళి, నిద్రాహారాలు మాని, శరీరాన్ని కృశింపచేయాలని అనుకుంటాం. కానీ భగవద్గీతలో 17వ అధ్యాయంలో మనోవాక్కాయములతో చేయగల మూడు విధాలైన తపస్సులను గీతాచార్యుడు మనకు ప్రబోధించాడు. అవేమిటో చూద్దాం.

శరీరంతో చేసే తపస్సు:
దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం |
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే || 17.14 ||

దేవతలను, ద్విజులను, గురువులను, జ్ఞానులను పూజించటం, శుచిగా, నిజాయితీగా ఉండటం, బ్రహ్మచర్యాన్ని, అహింసను పాటించటం శరీరంతో చేసే తపస్సు అవుతుంది.

 వాక్కుతో చేసే తపస్సు:
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియ హితం చ యత్ |
స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే || 17.15 ||

ఎవరికీ ఉద్వేగం కలిగించని, రెచ్చగొట్టని వాక్కు, అలాగే సత్యంగాను, అవతలివారికి ప్రియాన్ని, హితాన్ని కలిగించేదిగా ఉండే వాక్కు, ఇంకా వేదాధ్యయనం చెయ్యటం ఇవి వాక్కుతో చేసే తపస్సుగా చెప్పబడ్డాయి.

ఇక మనస్సుతో చేసే తపస్సు:
మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః |
భావ సంశుద్ధి రిత్యేతత్తపో మానసముచ్యతే || 17.16 ||

మనస్సును ప్రసన్నంగా ఉంచుకోవటం, ఎప్పుడూ సౌమ్య స్వభావం కలిగిఉండటం, మౌనంగా(లోపల ఏ సంకల్పాలు లేకుండా) ఉండటం, ఆత్మనిగ్రహం కలిగి ఉండటం, మనస్సులో ఎల్లప్పుడూ పరిశుద్ధమైన భావనలే ఉత్పన్నమవటం ఇవి మనస్సుతో చేసే తపస్సుగా చెప్పబడ్డాయి.

ఇదే విధంగా మా గురుదేవులైన శ్రీబాబూజీ మహారాజ్ వారు ఈ రకమైన తపస్సులను ఆశ్రమ నిత్య ప్రార్థన రూపంలో తేట తెలుగు పదాలలో అందించారు.

వాక్కుతో చేసే తపస్సు:
సత్య సుందర స్వరూపుడవైన ఓ పరమేశ్వరా! సత్యముగను, పవిత్రముగను, మృదువుగను ఉండు వాక్కును, నిర్మలమగు అంతఃకరణమును మాకు ప్రసాదింపుము.

శరీరంతో చేసే తపస్సు:
అవ్యాజ కరుణామూర్తీ! తను మన ధనములతో సదా ఇతరులకు మంచినే చేయుటకును, ఇతరులయందు మంచినే చూచుటకును, మంచినే గ్రహించుటకును తగిన సద్బుద్ధిని మాకు దయసేయుము.

మనస్సుతో చేసే తపస్సు:
దీనబంధూ! దయానిధే! మా మనస్సు అచంచల విశ్వాసముతో నిరంతరము నీయందే నిలచియుండునట్లు అనుగ్రహింపుము. మాలో భక్తి జ్ఞాన వైరాగ్య బీజములు అంకురించి, పెంపొంది, ఆత్మానంద ఫలమును ఒసగులాగున ఆశీర్వదింపుము.

బుద్ధితో చేసే తపస్సు:
ఓ పరంజ్యోతి స్వరూపా! మార్గ దర్శకుడవై చీకటినుండి వెలుగు లోనికిని, అసత్యమునుండి సత్యవస్తువు కడకును, మృత్యువునుండి అమృతత్వమునకును మమ్ము నడిపింపుము.

ఇలా లోకంలో ప్రతి ఒక్కరూ ఆచరిస్తే ప్రపంచానికి కలిగే ఫలితం:
దేవదేవా! నీ కృపచే మానవునికీ మానవునికీ మధ్య భేదబుద్ధి నశించి, సర్వ జీవులు సమభావముతోనూ, ప్రేమ దృష్టితోనూ మెలగుదురుగాక. లోకములన్నియు శాంతి సౌఖ్యములతో వర్ధిల్లునుగాక.
(ఆధ్యాత్మికతను మించిన సోషలిజం లేదనేవారు మా గురుదేవులు)

ఇక వ్యక్తిగతంగా మనకు కలిగే ఫలితం:
ప్రభూ! అనుక్షణమును, అంత్యకాలమునను నీ స్మరణమే మా జిహ్వయందు నిలచుగాక. నీ రూపమే మా మనస్సునందు నిలచియుండుగాక. ఈ జన్మమే మా కడసారి జన్మమై నీ సాయుజ్యమును పొందించుగాక.

పాహిమాం! పాహిమాం! పాహిమాం! పాహి!!!
హరిః ఓం తత్సత్!


10, ఫిబ్రవరి 2015, మంగళవారం

కల్పవృక్షం నీడలో ఉంటే?

చిన్నప్పుడు చదువుకున్న కథ. బహుశః శ్రీ రామకృష్ణ పరమహంస స్వామి చెప్పినది అనుకుంటా. ముందుగా ఆ కథ చెప్పుకొని, అది నా అనుభవంలోకి ఎలా వచ్చిందో చూద్దాం.

ఒక బాటసారి అడవిలో ఎంతో దూరం నడచి అలసిపోయి ఒక చెట్టు నీడకు చేరాడు. అయితే ఆ చెట్టు కల్పవృక్షమని అతనికి తెలియదు. చాలా ఆకలితో ఉన్నాడేమో, తినడానికి ఏమైనా దొరికితే బాగుండును అనుకున్నాడు. వెంటనే అతని ముందు పంచభక్ష్య పరమాన్నాలతో విందు భోజనం ప్రత్యక్షమయ్యింది. ఆవురావురుమంటూ విందారగించిన అతనికి ఆపుకోలేనంత నిద్ర ముంచుకొచ్చింది. ఇప్పుడు పడుకోవటానికి ఒక మంచం ఉంటే ఎంత బాగుంటుందో అనుకున్నాడు. వెంటనే హంసతూలికా తల్పం ప్రత్యక్షమయింది. దానిమీద విశ్రమించిన అతనికి తన భార్య ప్రక్కన ఉండి కాళ్ళు వత్తుతూ తాంబూలం తినిపిస్తుంటే భలేగా ఉంటుంది కదా అన్న కోరిక కలిగింది. వెంటనే తాంబూలం పళ్ళెంతో అతని భార్య ప్రత్యక్షమయ్యింది. ఇక మన వాడికి ఆలోచన మొదలయ్యింది. ఉన్నట్టుండి ఇంత కారడవిలో ఈ విందు భోజనం, ఈ తల్పం, తన భార్య ప్రత్యక్షమవటం ఏమిటి? కొంపదీసి ఇది ఏదో భూతం కాదు కదా? అనుకున్నాడు. వెంటనే ఆ భార్య భూతంలా మారిపోయింది. అమ్మో ఇది నన్ను మ్రింగేస్తుందేమో అని భయపడ్డాడు. వెంటనే ఆ భూతం అతనిని మ్రింగివేసింది.

నేను కూడా ఎన్నో జన్మలనుంచి ఈ సంసారమనే అరణ్యంలో పరిభ్రమిస్తూ చివరికి మా గురుదేవులైన శ్రీబాబూజీ మహారాజ్ అనే కల్పవృక్షం నీడకు చేరాను. 2003లో మా ఆశ్రమంలో సహస్ర చండీ యాగం జరుగుతున్న రోజులలో, అమెరికానుండి వచ్చి, కర్తలుగా యాగంలో సేవ చేసుకుంటున్న భక్తులను చూసి, "ఆహా! నేను కూడా అమెరికా వెళ్ళి బాగా డబ్బులు సంపాదిస్తే ఇలాగే సేవ చేసుకోవచ్చు కదా" అన్న ఆలోచన నాకు కలిగింది. (చాలా డబ్బులు కావాలని తపస్సు చేసినవాడు తీరా శివుడు ప్రత్యక్షమైతే మా మేనమామ చెవులనిండా వెంట్రుకలు మొలిపించమని వరం కోరుకున్నట్లే ఉంటాయి మన తెలివితేటలు. మనకు ఏది కావాలో అది డైరెక్టుగా కోరుకోకుండా ఇలా డొంకతిరుగుడు వ్యవహారాలన్నీ చేస్తాం.) ఆ మర్నాడే "అమెరికా వెళ్ళాలి, వెంటనే బయలుదేరి రమ్మని" మా ఆఫీసునుండి ఫోను వచ్చింది. హాయిగా ఇంత మహత్తర యాగాన్ని దర్శించి ఆనందిస్తూ ఉంటే మధ్యలో ఈ విఘ్నం ఏమిటని తిట్టుకున్నాను కానీ, అది నా కోరిక వల్లనే వచ్చినదని అప్పుడు గుర్తించలేకపోయాను. ఈ డొంకతిరుగుడు వ్యవహారంతో కొసరు కోరిక వెంటనే తీరినా, అసలు కోరిక తీరటానికి మరో పదేళ్ళు పట్టింది.

అలాగే 2005లో ఒకసారి ఎయిర్ఇండియా విమానంలో ప్రయాణిస్తూ, "మన దేశపు విమానంలో ప్రయాణం బాగానే ఉంది కాని, మనం రెండు వందల ఏళ్ళపాటు బ్రిటీషువారికి దాశ్యం చేశాము కదా, ఒకసారి ఆ బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం ఎక్కి వాళ్లతో సేవలు చేయించుకుంటే ఎలా ఉంటుంది?" అన్న ఆలోచన కలిగింది. నెల తిరక్కుండా మా ఆఫీసువాళ్ళు బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో నన్ను అమెరికా పంపించారు. అప్పుడు మొదటిసారి నాకు భయం వేసింది. "అమ్మో! ఇలా అనుకున్నవన్నీ జరిగిపోతూ ఉంటే చాలా ప్రమాదం సుమా! ఇకనుంచి కోరికలను అదుపులో పెట్టుకోవాలి" అనుకున్నాను.

అయితే పైన చెప్పుకున్న కథలో మనం చూస్తే, కల్పవృక్షం నీడలో ఉన్నవారు తమ కోరికలనే కాక ఆలోచనలను, భయాలను, సందేహాలను అన్నింటినీ అదుపులో పెట్టుకోవాలి. అలాంటి కనువిప్పు కలిగించే సంఘటన 2013 సెప్టెంబర్లో జరిగింది. మన దేశంలోని హోటళ్ళలో "ప్లేటులో చేతులు కడుగరాదు" అన్న బోర్డులు ఎంత సహజమో, అమెరికాలోని హోటళ్ళలో తినే పదార్థాలు గొంతుకు అడ్డం పడితే ఏమి చెయ్యాలో సూచించే బోర్డులు అంత సహజంగా ఉంటాయి. ఒకరోజు ఆఫీసునుండి ఇంటికి వస్తూ బస్సులో ఉండగా ఈ బోర్డు గుర్తుకు వచ్చి, "ఈ అమెరికా వాళ్ళు అన్నింటికీ అతిగా భయపడతారు. మన దేశంలో ఆహారం గొంతుకు అడ్డంపడి చనిపోయినవాడ్నిఒక్కడ్ని కూడా చూడలేదు. అంత చిన్న విషయాన్ని వీళ్ళు ఇంత పెద్దదిగా చేస్తున్నారు" అని నవ్వుకున్నాను. రెండు మూడు రోజుల తరువాత, ఒక రాత్రి అలవాటు ప్రకారం విటమిన్ మాత్ర వేసుకొని, నీళ్ళు త్రాగేలోపు ఆ మాత్ర గొంతులో అడ్డం తిరిగింది. అసలు నీళ్ళు మ్రింగటానికి కూడా అవకాశం లేదు. క్షణాలలో శ్వాస అందటం ఆగిపోయింది. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఎంత ప్రయత్నించినా ఆ మాత్ర లోపలికి వెళ్ళదు, బయటికి రాదు. శ్వాస ఆడకపోవటంతో మెల్లగా స్పృహ తప్పుతోంది. "ఈ జీవితానికి అంతం ఇలా నిర్ణయించారా ప్రభూ" అని ఒక్కసారి శ్రీగురుదేవులను తలచుకొని ఇక అన్ని ప్రయత్నాలను విరమించి ప్రశాంతంగా మరణించటానికి సిద్ధపడ్డాను. అప్పుడు, "అంత తేలిగ్గా చేతులెత్తేస్తే ఎలా? బ్రతకడానికి ప్రయత్నించు" అన్న అంతర్వాణి వినిపించడం, ఇందాక చెప్పుకున్న హోటల్లోని బోర్డుపై ఉండే సూచనలు గుర్తుకురావడం ఒకేసారి జరిగాయి. వెంటనే మళ్ళీ స్పృహ వచ్చింది. అప్పుడు బాగా ముందుకు వంగి పొట్టమీద చేతులతో నొక్కుకుంటే ఆ మాత్ర బయటపడింది.

ఇలా పైన చెప్పుకున్న కధలోని కల్పవృక్షం వలె శ్రీగురుదేవులు సాక్షీమాత్రంగా ఉంటూ మా అందరి జీవితాలను నడిపిస్తున్నారు. అయితే, తాను కల్పవృక్షం నీడలో ఉన్నానన్న విషయాన్ని గ్రహించని ఆ బాటసారి మొదట్లో ఆనందాన్ని పొందినా, తరువాత నాశనం అయిపోయాడు. కానీ ఆ విషయాన్ని గుర్తించినవారు సదా మంచినే కోరుకుంటూ, మంచి ఆలోచనలే చేస్తూ, మంచినే చూస్తూ తమ జీవితాన్ని సరిదిద్దుకో గలుగుతారు. మా ఆశ్రమ ప్రార్థనలోని సారాంశం ఇదే. ఈ విషయాన్ని ఎప్పుడైనా మరచిపోయి తప్పుడు ఆలోచనలు చేసినా, శ్రీగురుదేవులు దయామయులై మనకు బుద్ధి తెప్పించి మళ్ళీ మంచి మార్గానికి మరలుస్తారు.



5, ఫిబ్రవరి 2015, గురువారం

కామ దహనం

నాకు చాలా కాలం ఒక విషయం అర్థం అయ్యేది కాదు. తారకాసురుడు లోకలన్నింటినీ పీడిస్తూ ఉంటే లోక రక్షణార్థం పార్వతీపరమేశ్వరులను కలపడానికి ప్రయత్నించిన మన్మధుడు శివుని కోపాగ్నికి ఎందుకు భస్మం కావలసి వచ్చింది అని. ఒకవేళ మన్మధుని గర్వభంగం కోసమని అనుకుంటే, శివుడు మన్మధుని బాణాలకు లొంగకుండా ఉంటే దానితోనే గర్వభంగం అయిపోయేది కదా.

ఇక్కడ మనం మన్మధుడు నెరవేర్చాలనుకున్నశివ పార్వతుల కళ్యాణం ఎలా జరిగిందో చూద్దాం. మన్మధుని బాణాలచే పీడింపబడి కూడా పరమేశ్వరుడు చక్కగా అలంకరించుకొని, రూప లావణ్యాలతో అలరారుతున్న పార్వతీదేవిని కన్నెత్తి చూడలేదు. అప్పుడు ఆ జగన్మాత కఠోర తపోదీక్షను పూని కొంతకాలం ఆకులు మాత్రమే తీసుకుంటూ, తరువాత వాటిని కూడా మానివేసి, మరికొంత కాలానికి శ్వాసను కూడా బంధించి తపమాచరించింది. ఇలా చిక్కి శల్యావశిష్టయై ఉన్న ఆ తల్లిని, అప్పుడు కూడా ఇంకా కఠినమైన తన పరీక్షకు గురిచేసి, ఆమె మనోనిగ్రహాన్ని, తనపై గల ప్రేమను నిర్ధారించుకున్నాకనే పరమేశ్వరుడు పార్వతీమాతను పరిణయమాడాడు.

మరి అంతటి కఠోర సాధనతో, పరీక్షలకు తట్టుకుని, సంపూర్ణ శరణాగతితో, సర్వ సమర్పణ భావనతో పొందవలసిన పరమేశ్వరుని ప్రేమను, ఆయనలో కామ వాంఛలను రెచ్చగొట్టడం ద్వారా పొందింపచేయాలనుకోవటమే మన్మధుడు చేసిన పెద్ద తప్పు.

2, ఫిబ్రవరి 2015, సోమవారం

బెడ్రూంలో భగవంతుడు

చాలా మందికి బెడ్రూంలో దేవుడి ఫోటో పెట్టుకోకూడదని ఒక అపోహ ఉంటుంది. మన భారతీయ సనాతన ధర్మం ప్రకారం ప్రతి మానవుడు సాధించవలసిన పురుషార్థాలలో కామం కూడా ఒకటి. అర్థం, కామం రెండూ ధర్మానికి బద్ధమై ఉన్నప్పుడు అవి మోక్షానికి దారితీస్తాయి. కనుక ధర్మబద్ధంగా ఒక్కటైన భార్యాభర్తలు చేసే సంసారం పూర్తిగా ధర్మ సమ్మతమైనది, పుణ్య ప్రదమైనది. అందులో పాపానికి తావు లేదు.

ఇక మనం దేవుని ఫోటో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, మన పడకగదితో సహా ఈ సృష్టిలోని అణువణువులో ఆ భగవంతుడు నిండే ఉన్నాడు. ఆయన చూడలేనిది, కొత్తగా చూసేది ఏదీ లేదు. అలాగే అయన చూడటమంటే అది ఏదో పరాయివారి పడక గదిలోకి తొంగి చూసినట్లు కాదు. అద్దంలో మనని మనం చూసుకున్నట్లే ఆయన మనని చూస్తాడు. ఎందుకంటే మనందరం ఆయన ప్రతిరూపాలమే.

ఈ విషయం ఎవరైనా సమర్థులైన సద్గురువులతో, అవతార పురుషులతో సన్నిహితంగా మెలగినవారికి తప్పకుండా అనుభవంలోకి వచ్చి ఉంటుంది. ఒకసారి మా గురుదేవులైన శ్రీబాబూజీ మహారాజ్ వారు భగవన్నామాన్ని సర్వకాల సర్వావస్థలయందు జపించవచ్చు అని బోధిస్తున్నప్పుడు ఒక పండితుడు ఇలాగే భగవన్నామం చాలా పవిత్రమైనది, దానిని ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడపడితే అక్కడ జపించకూడదు అని వాదించాడు. ఆ మర్నాడు అతనికి అనేక విరేచనాలు అయ్యి, కళ్ళలోకి ప్రాణాలు వచ్చి, చివరికి బాత్రూములో భగవంతుడ్ని తలుచుకోక తప్పలేదు.

నిజానికి పడకగదిలో దేవుడి ఫోటో పెట్టుకుని ప్రతిరోజూ నిద్రపోయే ముందు ఆయనను చూడటం, అలాగే కళ్ళు తెరవగానే మళ్ళీ ఆయనను చూడటం అందరూ నేర్చుకోవలసిన ఒక మంచి అలవాటు.