29, జనవరి 2015, గురువారం

పూర్ణమదః పూర్ణమిదం

ఓం పూర్ణమదః పూర్ణమిదం పుర్ణాత్పూర్ణముదచ్యతే |
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ||

మాములుగా ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చుస్తే "అది పూర్ణం, ఇది పూర్ణం. పూర్ణంనుండి పూర్ణం ఉద్భవిస్తుంది. పూర్ణంనుండి పూర్ణం తీసివేసినా పూర్ణమే మిగులుతుంది." ఇది భగవంతుని పూర్ణ తత్వాన్ని చెప్పే శ్లోకం. భగవంతుని నుండి ఈ ప్రపంచమంతా ఉద్భవించినా ఆయనయొక్క పూర్ణత్వానికి ఏ లోటు లేదని చెపుతుంది. కానీ ఈ శ్లోకం మామూలు మన బుద్ధులకు అర్థం చేసుకోవటం కష్టం.

అందుకే మా గురుదేవులైన శ్రీబాబూజీ మహారాజ్ వారు ఈ శ్లోకానికి రెండు చక్కని ఉదాహరణలు చెప్పేవారు.

ఒక దీపం ఉందనుకోండి. ఆ దీపంనుండి ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు. ఒక దీపం నుండి ఇలా వెలిగించబడిన మిగిలిన దీపాలు కూడా అంతే కాంతిని కలిగిఉంటాయి. కానీ ఇలా ఎన్ని దీపాలు వెలిగించినా మొదటి దీపానికి వచ్చే లోపం ఏదీ లేదు. అది ఎప్పుడూ పూర్ణంగానే ఉంటుంది.

అలాగే మనం ఒక అక్షరం చక్కగా నేర్చుకున్నామనుకోండి, ఆ అక్షరాన్ని మనం ఎంతమందికైనా నేర్పించవచ్చు. అలాగే ఆ అక్షరాన్ని మనం ఎన్నిసార్లైనా వాక్కు ద్వారా, వ్రాత ద్వారా ఉపయోగించవచ్చు. కానీ మనలో ఇమిడిపోయిన ఆ అక్షరానికి ఎటువంటి లోటు రాదు. అది ఎప్పుడూ పూర్ణంగానే మనలో నిలిచి ఉంటుంది.

ఇలాంటిదే మనం లెక్కలలో infinityని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

28, జనవరి 2015, బుధవారం

సుఖంలో రకాలు

మనం అనుభవించే సుఖాలు మూడు రకాలని భగవద్గీతలో 18వ అధ్యాయం 37 నుంచి 39వ శ్లోకం దాకా చెప్పబడింది.

ముందుగా సాత్విక సుఖం:
యత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం |
తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మ బుద్ధి ప్రసాదజం ||

మన బుద్ధిని ఆత్మయందు నిలిపి ఉంచి ప్రసన్నమైన మనస్సుతో చేసే సత్కర్మలు ఆచరించబడేటప్పుడు కష్టంగా తోచినా వాటి ఫలం మాత్రం మనకు శాశ్వతమైన సుఖాన్ని ప్రసాదిస్తుంది. అందుకే ఇట్టి సుఖాన్ని సాత్విక సుఖం అన్నారు. ఉదాహరణకు మనకు తెల్లవారు ఝామున లేచి ధ్యానం చేసుకోవాలన్నా, ఉదయాన్నే స్నానం చేసి పూజ చేసుకోవాలన్నా, ప్రతి రోజూ దేవాలయానికి వెళ్ళాలన్నా, మనకున్న దాంట్లో కొంత దానం చెయ్యాలన్నా కష్టంగానే ఉంటుంది. కానీ కష్టపడి ఈ సత్కర్మలను చేయటం ద్వారా మనకు లభించే సుఖం మాత్రం శాశ్వతంగా నిలచిపోతుంది. మనకు అమృతత్త్వాన్ని ప్రసాదిస్తుంది.

మరి రాజస సుఖం:
విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే అమృతోపమం |
పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం ||

మన ఇంద్రియాలను విషయాల వెంట పరుగులు పెట్టించి వాటి ద్వారా మనం పొందే సుఖం ముందు అమృతప్రాయంగానే కనిపిస్తుంది కానీ అది ఒక పరిమితికి మించి అనుభవిస్తే విషతుల్యం అవుతుంది. దీనికి మా గురుదేవులు చక్కని ఉదాహరణ చెప్పేవారు. నీకు గారెలు ఇష్టం అనుకో, ఒక పరిమితికి లోబడి తింటే ఆనందంగానే ఉంటుంది. అదే చాలా ఇష్టం కదా అని ఒక నక్షత్రమాల(27) లాగించావనుకో ముందు కడుపులో ఉరుములు, మెరుపులు మొదలవుతాయి. తరువాత కుండపోతగా వర్షం పడుతుంది. ఇంటివారు ఘొల్లుమంటారు, డాక్టరు సంచీ ఘల్లుమంటుంది.

ఇక మూడవది తామస సుఖం:
యదగ్రే చానుబంధేచ సుఖం మోహనమాత్మనః |
నిద్రాలస్య ప్రమాదోత్ధం తత్తామాసముదాహృతం ||

నిద్ర, సోమరితనము, ప్రమాదము (మనం చేసే పనులలో, ఆలోచనలలో జాగరూకత లేకుండా మనం ఏమి చేస్తున్నామో మనకే తెలియకుండా ఉండటాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో ప్రమాదం అంటారు) వలన అనుభవించేటప్పుడు, ఆ తరువాత కూడా విషతుల్యం అయినప్పటికీ అమృతమయమని మనను భ్రమింపచేసే సుఖం తామస సుఖమని చెప్పబడింది. ఈ తామస సుఖానికి కూడా మా గురుదేవులు రెండు చక్కని ఉదాహరణలు చెప్పేవారు. ఒంటె ముళ్ళకంపను తింటుంది. అలాగే కుక్క ఎండిపోయిన ఎముకను కొరుకుతూ ఉంటుంది. ఈ రెండు ఉదాహరణలలో కూడా వాటికి తినే పదార్ధం నుండి వచ్చే సారం ఏదీ లేదు. కానీ ఆ ముళ్ళు/ఎముక వాటి నోటిలో గ్రుచ్చుకొని వాటి రక్తం కారుతూ ఉంటే ఆ రక్తం ఆ ముళ్ళకంప/ఎముక నుండే వస్తోందన్న భ్రమలో అవి వాటిని తింటూ ఉంటాయి. ఇక్కడ తినేటప్పుడు కానీ, ఆ తరువాత కానీ వాటికి ఏమాత్రం సుఖం లభించటం లేదు సరికదా అవి దుఃఖమునే పొందుతున్నాయి. కానీ ఏదో సుఖాన్ని పొందుతున్నామనే భ్రమలోనే ఉంటున్నాయి.

22, జనవరి 2015, గురువారం

సగుణం – నిర్గుణం

భగవంతుడు సాకారుడా? నిరాకారుడా? అని అనేకమంది చర్చించుకుంటూ ఉంటారు. ఆయనను సగుణంగా విగ్రహ రూపంలో పుజించాలా? లేక నిర్గుణంగా ఆరాధించాలా అని కూడా ఈ మధ్యన తరచూ చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల వస్తున్న కొన్ని సినిమాలు కూడా ఈ చర్చకు కారణమనుకోండి.

అయితే ఇలా చర్చించే వారు, ఈ విషయంపై వాదించి, వీలైతే బలవంతంగానైనా/హింసతోనైనా అవతలవారిని తమ మార్గంలోకి తెచ్చుకోవాలని అనుకునేవారు కొన్ని విషయాలు మరచిపోతున్నారు.

ముందుగా – భగవంతుడు సర్వ శక్తిమంతుడు అని అన్ని మతాలు బోధిస్తున్నాయి, ఆస్తికులందరూ ఒప్పుకుంటున్నారు. మరి సర్వ శక్తిమంతుడు అయినవాడికి సాకారంగానో, నిరాకారంగానో ఉండే శక్తి లేదంటారా? ఆయనకు ఆ మాత్రం స్వతంత్రం కూడా ఈ భక్తులు ఇవ్వరా? నిజానికి సగుణానికి, నిర్గుణానికి భేదం లేదు. ఘనీభవించిన మంచుగడ్డ, ప్రవహించే నీరు, గాలిలో తేలిపోయే ఆవిరి అన్నీ ఒకే పదార్థంయొక్క భిన్న రూపాలు కదా?

ఇక అర్చనా విధానాల దగ్గరకు వద్దాం. భగవంతుడే ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించాడని అన్ని మతాల వారు ఒప్పుకుంటారు. అంటే మనందరం ఆయన సంతానమే కదా. ఒక తండ్రికి పదిమంది పిల్లలు ఉన్నారనుకోండి, వారందరికీ తమ తండ్రిని సేవించుకోవాలనే సద్బుద్ధి పుట్టింది. ఇప్పుడు వారందరూ తలో రకమైన సేవ చేసుకుంటే ఆ తండ్రి ఎక్కువ సంతోషిస్తాడా? లేక అందరూ ఒకే విధంగా సేవించుకుంటాం అంటే ఎక్కువ సంతోషిస్తాడా? ఒకరు వంట చేసి, ఇంకొకరు ప్రేమగా తినిపించి, ఒకరు కాళ్ళు పట్టి, ఇంకొకరు కొత్త బట్టలు కొని ఇచ్చి, ఇలా అందరూ కలిసి ఆయనకు అవసరమైన సేవలన్నీ చేసుకుంటేనే ఆయన ఎక్కువ సంతోషిస్తాడు కదా?

గట్టిగా 70 – 80 ఏళ్ళు జీవించని మనమే పూటకో రకమైన తిండి, బట్ట, వినోదం, వ్యాపకం కావాలనుకుంటున్నామే? ఒకే రకమైనవి లభిస్తే బోరు కొట్టిందని విసుక్కుంటున్నామే? మరి ఎన్నో కోట్ల సంవత్సరాలనుంచీ ఉంటూ ఇక ఎప్పటికీ అలాగే ఉండే భగవంతుడు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటూ, ఒకే విధమైన పూజలు అందుకోవాలని శాసించే వారిని ఏమనాలి?


అందుకే మన భారతీయ సనాతన ధర్మం భగవంతుని వివిధ రూపాలలో(ఇందులో అరూపం కూడా భాగమే), వివిధ నామాలతో, వివిధమైన అర్చనా విధానాలతో సేవించుకొనే అవకాశం కల్పించింది. తన పేరు చెప్పి కొట్టుకునే కొడుకులకన్నా, కనీసం తనకోసమైనా కలసి ఉండే కొడుకులను చూసే ఏ తండ్రైనా సంతోషిస్తాడు. మనందరికీ తండ్రి అయిన భగవంతుడికి ఈ పాటి చిన్న సంతోషాన్ని కలిగిద్దాం. 

21, జనవరి 2015, బుధవారం

త్రిగుణాలు

త్రిగుణాల గురించి మా గురుదేవులైన శ్రీబాబూజీ మహారాజ్ వారు అనేక ఉపమానాలు చెప్పేవారు. అందులో కొన్ని:
1) ఒక చీకటి గదిలో ఒక దీపం ఉంది. కానీ దానిమీద మూడు మూకుళ్ళు ఉన్నాయి. అందువలన ఆ దీపం వెలుగు ప్రసరించక గదంతా చీకటిగా ఉంది. ముందుగా పైనున్న ఇనుప మూకుడును పగులగొడితే లోపలనున్న చిల్లుల మూకుడు నుంచి కొద్ది కొద్దిగా వెలుగు ప్రసరించి గదిలో ఉన్న వస్తువులు తెలుస్తాయి. ఆ చిల్లుల మూకుడును కూడా పగులగొడితే లోపలనున్న గాజు మూకుడు నుండి దీపం కాంతి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఈ గాజు మూకుడు కూడా కొంత కాలానికి మసిబారే అవకాశం ఉంది. కనుక ఆ మూకుడును కూడా తొలగించుకుంటే శాశ్వతంగా దీప కాంతిని అనుభవించవచ్చు. ఇందులో ఇనుప మూకుడు తమోగుణం. చిల్లుల మూకుడు రజోగుణం. గాజు మూకుడు సత్వగుణం. ఈ మూడు గుణాలు మనలోనే ఉన్న జ్ఞానజ్యోతిని దర్శించటానికి పైన చెప్పిన ఉదాహరణలోవలె మనకు అడ్డు పడుతున్నాయి.

2) తెల్లని కాంతిని మూడు పలకలు గల గాజు పట్టకం(prism)లోనుండి ప్రసరింప చేస్తే ఆ తెల్లని కాంతి విక్షేపం చెంది ఏడు రంగులలో మనకు కనిపిస్తుంది. అలాగే ఒక్కడే అయిన పరమాత్మ మూడు గుణాలతో కూడిన మన మనస్సులకు ఇన్ని విభిన్న రూపాలలో, లక్షణాలతో ప్రకృతిగా కనిపిస్తున్నాడు. ఈ మూడు గుణాలను తొలగించుకుంటే సర్వత్రా ఒక్క పరమాత్మనే దర్శించ గలుగుతాం.

3) మూడు రెక్కలు గల ఫ్యాన్ ఆగి ఉన్నప్పుడు రెక్కలు మూడు విడి విడిగా కనిపిస్తాయి. అదే ఫ్యాన్ వేగంగా తిరిగినప్పుడు మూడు రెక్కలు మాయమై ఒక్కటే ఆకారం కనిపిస్తుంది. అలాగే భగవన్నామాన్ని వేగంగా (అంటే మధ్యలో విషయాలేవీ అడ్డు రాకుండా) జపించినప్పుడు ఈ మూడు గుణాలు మాయమై ఏకవస్తు దర్శనం అవుతుంది.

4) ఆధ్యాత్మిక సాధనలో మనం ముందుగా రజోగుణాన్ని (అంటే దానిలో భాగమైన పట్టుదల, ఏదైనా సాధించగలననే ఆత్మ విశ్వాసం మొదలైనవి) ఉపయోగించుకొని తమోగుణాన్ని(అంటే బద్ధకాన్ని, సోమరితనాన్ని) జయించాలి. ఆ తరువాత సత్వగుణాన్ని ఉపయోగించుకొని రజోగుణాన్ని కూడా జయించాలి. ఇక చివరిగా సత్వగుణాన్ని కూడా జయిస్తేనే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది.

5) రజో, తమో గుణాలు ఇనుప, ఉక్కు సంకెళ్ళ లాంటివైతే సత్వగుణం బంగారు సంకెల లాంటిది. ఏ సంకెల అయినా మనను బంధించేదే.

18, జనవరి 2015, ఆదివారం

గడ్డపార మింగితే

ముందుగా ఇంత చక్కని అన్నమయ్య కీర్తనను పరిచయం చేసిన శ్రీ ఎనగంటి రవి చంద్ర గారికి నా కృతజ్ఞతలు.

ఈ పాట యొక్క పూర్తి సాహిత్యం కోసం ఇక్కడ చుడండి.

ఈ పాట యొక్క అర్థాన్ని నాకు అవగాహన అయినంతవరకు వివరిస్తాను.

గడ్డపార (గునపం) యొక్క ముఖ్య ఉపయోగం దానితో నేలను త్రవ్వి మొక్కలు నాటుకోగలగటం. ఆ మొక్కలకు కాసిన పండ్లుగాని, కూరగాయలుగాని మన ఆకలిని తీరుస్తాయి. అంతేకాని ఆ గునపాన్ని మింగేస్తే మన ఆకలి తీరదు కదా. అలాగే మన సంసార బంధానికి కారణమైన మనస్సును, ఇంద్రియాలను పరమాత్మవైపుకు మరల్చుకోవాలి కానీ సంసారాన్ని వదలివేస్తానంటే అది మనను మళ్ళీ అంతకంటే తీవ్రంగా కమ్ముకుంటుంది.

స్వేచ్ఛగా ఆకాశంలో తిరిగే చిలకలను తెచ్చి బండికి కట్టి లాగమంటే అవి లొంగకపోగా బండిని కూడా ఆకాశంలోకి ఎగరేసుకు పోవటానికి ప్రయత్నిస్తాయి. అలాగే ఇంద్రియాలను బలవంతంగా నిగ్రహించుకుంటే అవి సమయం కోసం పొంచి ఉండి మనను ఘోరంగా దెబ్బ తీస్తాయి.

మండే అగ్నిని తెచ్చి మసి గుడ్డలో మూటకట్టి ఇంట్లో పెట్టుకుందామంటే అది దాగి ఉండకపోగా ఇల్లంతా తగలబెట్టేస్తుంది. అలాగే మమకారాన్ని బలవంతంగా దాచి ఉంచుదామంటే అది మనలనే బానిసగా చేసుకుని ఆశలలో పడవేస్తుంది.

అలాగే విష సర్పాన్ని తెచ్చి దిండుకింద పెట్టుకొని అణగి ఉండమంటే అది మననే కాటు వేస్తుంది. అందువల్ల ఈ సంసారాన్ని నిగ్రహించాలంటే మనవల్ల కాదు. అది కేవలం శ్రీవేంకటేశ్వరునియందు భక్తితోనే సాధ్యం.

ఇదే విషయాన్ని మా గురుదేవులైన శ్రీబాబూజీ మహారాజ్ వారు ఇలా చెప్పేవారు - ఇంద్రియాలు, మనస్సు స్ప్రింగ్ వంటివి. బలవంతంగా అణచి పెట్టాలని చుస్తే అదను చూసి అంతకంటే బలంగా ఎదురు తిరుగుతాయి. ఈ మనస్సు, శరీరము మనకు శత్రువులు కావు. పరమార్థ సాధనకు ఎంతో ఉపయోగపడే సాధనాలు(శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం). అశాశ్వతమైన క్షణిక సుఖాల కోసం పరుగులు పెట్టే వీటికి శాశ్వతమైన పరమాత్మ వస్తువునందు మెల్లమెల్లగా ఆసక్తిని కలిగించాలి. ఒకసారి రుచి మరిగిన తరువాత వాటంతట అవే సంసారాన్ని వదిలివేస్తాయి.

ఇదే విషయాన్ని భగవద్గీతలో గీతాచార్యుడు అనేక పర్యాయాలు చెప్పటం జరిగింది(ప్రకృతిం యాన్తి భూతాని నిగ్రహః కిం కరిష్యతి......., మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి....., ఇలా). ఇంకా త్యాగరాజ స్వామివారు కూడా "మనసా ఎటులోర్తునే? నా మనవిని చేకొనవే" అని తన మనస్సును బ్రతిమాలుకున్నారు. అలా కాదని పట్టుదలకు పోయి తపస్సు చేసిన విశ్వామిత్ర మహర్షి అనేక పర్యాయాలు తన మనస్సుకు, ఇంద్రియాలకు లొంగిపోయిన చరిత్ర మనకు తెలుసు. అలాగే ఎంతో పట్టుదలతో తపస్సులు చేసిన రాక్షసులందరూ తమ తపస్సులు ఫలించగానే మళ్ళీ మనస్సుకు, ఇంద్రియాలకు లొంగిపోయారు.

కనుక మనం ప్రహ్లాదుడు(కంజాక్షునకుగాని కాయంబు కాయమే........, మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు బోవునే మదనములకు... మొదలైన పద్యాల ద్వారా), కులశేఖరాళ్వార్(జిహ్వే కీర్తయ కేశవం... మొదలైన శ్లోకాల ద్వారా) మొదలైన మహా భక్తులు చూపిన బాటలో మెల్లమెల్లగా మన మనస్సును, ఇంద్రియాలను పరమాత్మ వైపుకు త్రిప్పుకోవాలి.

17, జనవరి 2015, శనివారం

వాడల వాడల వెంట

అన్నమయ్య కీర్తనలలో "వాడల వాడల వెంట వాడవో నీడనుండి చీరలమ్మే నేత బేహారి" అనే కీర్తన చాలా బాగుంటుంది.

ఇందులో అన్నమయ్య పరమాత్ముని ఒక చీరలు నేసే నేతవానిగా, ఇంకా వాటిని అమ్మే వ్యాపారిగా కీర్తిస్తారు.

పంచభూతములనే నూలుతో మన దేహలనే చీరలు తయారవుతాయి. ఈ నూలు దారాలు స్థిరంగా నిలబడటానికి మాయ అనే గంజి కలిపి ఈ చీరలను నేస్తారు. ఇంకా ఆ చీరాల మీద ఉండే పలు రకాల రంగు రంగుల డిజైన్ల కోసం స్వామి గుణములనే నూలును వాడుతారట.

అయితే సంతలో ఈ చీరలను కొనుక్కునే జీవులకి ఒకేసారి అనేక చీరలు కొనుక్కుని బీరువాలో దాచుకొనే సౌలభ్యం లేదు. తన దగ్గరున్న చీరను (దేహాన్ని) స్వామికి ఇచ్చేసి, ఇంకా తన కర్మ అనే ధనాన్ని వెచ్చించి దానికి అనుగుణమైన కొత్త చీరను (దేహాన్ని) స్వామి నుండి కొనుక్కోవాలి. అందుకే స్వామిని అన్నమయ్య మారు బేహారి అంటారు.

అయితే మరి స్వామి వ్యాపారం ఎప్పుడు బాగా గిట్టుబాటు అయినట్టు? ఆ ఊరిలోని జీవులందరికీ ఇక చీరలు కొనే అవసరం ఎప్పుడు కలుగకుండా పోతుందో (అంటే మళ్ళీ జన్మించవలసిన అవసరం లేకుండా పోతుందో) అప్పుడు. అందుకే అన్నమయ్య స్వామిని నీడపట్టున (వైకుంఠంలో) కూర్చోకుండా వాడల వాడల వెంట తిరుగుతూ (గురువుల, మహాత్ముల రూపంలో మాటిమాటికీ అవతరిస్తూ) వ్యాపారం చేసుకోమని (జీవులందరినీ ఇక శరీరం ధరించే అవసరం లేని మోక్ష స్థితికి చేర్చుకోమని) సూచిస్తున్నారు.

16, జనవరి 2015, శుక్రవారం

సంక్రాంతి - తుమ్మెద

నిన్న సంక్రాంతి సందర్భంగా ఏ తెలుగు టీవీ ఛానెల్ పెట్టినా ఒకటే పాట - సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా - అంటూ. అసలు సంక్రాంతికి, తుమ్మెదకు ఉన్న ఈ లింకేంటో నాకు అర్థం కాలేదు. అసలు తుమ్మెద లేని సంక్రాంతి పాటలే లేవా?