24, ఫిబ్రవరి 2017, శుక్రవారం

ఓం జ్ఞాన నేత్ర ప్రదాయకాయ నమః


మనందరికీ మనం శివునినుండే వచ్చామనీ తెలుసు, అలాగే మనలోనే ఆ శివుడున్నాడనీ తెలుసు. అయినా అయన శివుడిగానే ఉన్నాడు, మనం మాత్రం చివరికి శవాలుగా మిగిలిపోతున్నాం. ఏమిటి దీనికి కారణం? ఆ శివునిలో ఉన్నది, మనలో లేనిది ఏమిటి? అని ఆలోచిస్తే ఆయనకు మనకన్నా ఎక్కువగా ఉన్నది మూడవ కన్ను. అదే జ్ఞాన నేత్రం. ఆ కన్ను ఒక్కసారి తెరుచుకుందంటే ఇక జాతి, నీతి, కులం, గోత్రం, నామం, రూపం, గుణం, దోషం, దేశం, కాలం ఇలా మనం పెట్టుకున్న విశేషనాలన్నీ కాలి బూడిద అయిపోయి, విభూతి(భగవంతుని వైభవం) ఒక్కటే మిగులుతుంది.

నశ్వరమైన ఈ దేహమే నేనని భావించేవాడికి మృత్యువుకానీ సర్వవ్యాపకమై నిత్యమైన ఆత్మవస్తువును నేనని తెలుసుకున్నవాడికి ఇక చావు పుట్టుకలెక్కడివి? అటువంటి జ్ఞాన నేత్రాన్ని మనకు ప్రసాదించటానికి స్వయంగా మళ్ళీ ఆ సదాశివుడే సద్గురు రూపం ధరించి మాటిమాటికీ మన మధ్యకు వచ్చి, మనతోనే ఉండి, మనలోనే ఉన్న శివుడిని దర్శింపచేసి జగత్తంతా శివమయమే అన్న ఆరూఢమైన జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తారు.

మనకు కనిపించే ఈ ప్రపంచంలో మనం అగ్నిని, జలాన్ని అన్నింటికంటే పవిత్రమైనవిగా భావిస్తాం. ఎటువంటి మలినాలనైనా అగ్ని కాల్చివేసి స్వచ్ఛమైన విభూతిగా మార్చివేస్తుంది. అలాగే మురికి కాలువలో నీళ్ళైనా గంగానదిలో కలవగానే మనం పవిత్రంగా శిరస్సున జల్లుకుంటాం. కానీ భగవద్గీతలో స్వామి "నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే" - జ్ఞానంతో సరిపోల్చగల పవిత్ర వస్తువు మరేదీ లేదు అని స్పష్టంగా చెప్పారు. అట్టి జ్ఞానాన్ని ప్రసాదించే పరశివ స్వరూపులైన గురువులకు వందనం.

1, డిసెంబర్ 2016, గురువారం

అవ్యభిచార భక్తి

మనకి మనం గొప్ప భక్తులమని భ్రమపడుతూ ఉంటాం. పూజలూ, వ్రతాలూ, దీక్షలూ ఎంతో శ్రద్ధగా చేస్తాం. కాని అవి పూర్తవగానే "హమ్మయ్య ఓ పనైపోయింది" అనుకొని మళ్ళీ విషయాల వెంట పరుగులు పెడతాం. దీనినే వ్యభిచార భక్తి అంటారు. ఒక వ్యభిచారణియైన స్త్రీ తన భర్తకు ఎన్ని సేవలు చేసినా ఆమె మనసు ఎప్పుడూ "భర్త ఎప్పుడు బయటకు పోతాడా, ఎప్పుడెప్పుడు ప్రియుడ్ని కలుసుకుందామా" అని ఆరాటపడుతూ ఉంటుంది. మన భక్తి కూడా అలాంటిదే.

మరి మనం పనులన్నీ మానుకొని ఎప్పుడూ పూజలూ, భజనలూ చేస్తూ కూర్చోవాలా? అనే ప్రశ్న ఇక్కడ సహజంగా వస్తుంది. అవసరం లేదు. ఒక పతివ్రతయైన స్త్రీ తన భర్త ఊరిలో లేకపోయినా ఇంట్లో పనులన్నీ మామూలుగానే చేసుకుంటుంది. కానీ ఏ పని చేస్తున్నా తన భర్త ఎలా ఉన్నాడో, ఇప్పుడు ఏం చేస్తున్నాడో, సరిగ్గా తిన్నాడో లేదో అని ఆలోచిస్తూనే ఉంటుంది. అలా మనం ఏంచేస్తున్నా నిరంతరం భగవంతుని గూర్చి ఆలోచిస్తూ ఉండటమే అవ్యభిచార భక్తి.

తల్లికి ఎప్పుడూ తన పిల్లల సంక్షేమాన్ని గురించే చింత కదా. అందుకే హిరణ్యక్షుని వంటి ఘోర రాక్షసుని బారినుండి తనను రక్షించడానికి వరాహమూర్తిగా వచ్చిన జగన్నాధుని ఆ తల్లి భూమాత అడిగిన ప్రశ్న: "ప్రారబ్ధాన్ని అనుభవించడానికై జన్మించిన మానవులకు అవ్యభిచార భక్తి ఏ విధంగా అలవడుతుంది స్వామీ?" అని. అందుకు స్వామి ఒక చక్కని పరిష్కారాన్ని సూచించారు. "ఎవరైతే తమ జీవితంలో భగవద్గీతను అభ్యాసం చేస్తారో వారు అవ్యభిచార భక్తిని కలిగి, ముక్తులై, కర్మలు అంటక సుఖంగా జీవిస్తారు" అని. ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం కేవలం గీతాధ్యయనం సరిపోదు. గీతాభ్యాసం కావాలి. అంటే కేవలం థియరీని అర్ధం చేసుకొని, బట్టీకొడితే సరిపోదు. దానిని ప్రాక్టికల్‌గా నిత్యజీవితంలో ఆచరించాలి.

11, అక్టోబర్ 2016, మంగళవారం

అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా

జగన్మాతను ఎక్కడ వెదకాలి? ఎలా తెలుసుకోవాలి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ జంట నామాలు. మనం ఆ తల్లిని పూజించటం కోసం ఎన్నెన్నో క్షేత్రాలు, దేవాలయాలు తిరుగుతాం. ఎక్కడెక్కడికో వెళతాం. కానీ బయట ఎంతగా వెదకినా ఆ తల్లిని అందుకోలేము. అందుకు మనం చెయ్యవలసినది మన లోపల వెదుక్కోవడం. ఆ తల్లి నిరంతరం మనలోనే ఉండి మనలను నడిపిస్తోంది. ఈ కనపడే శరీరానికి, లోపలి మనస్సుకి, వాటికి ఆధారమైన ప్రాణానికి, వీటన్నింటినీ నడిపించే విజ్ఞానానికీ, మన సహజ స్థితియైన ఆనందానికీ కూడా లోపల ఉండి నడిపించేది ఆ తల్లే. అందుకే ఆవిడ "పంచకోశాంతర స్థితా".

ముందుగా మనం మనలోనే "చేతనారూపంలో" ఉండి మనలను నడిపిస్తున్న ఆ "చిచ్ఛక్తిని" గుర్తిస్తే అప్పుడు మనం బయట ఉన్న "జడాత్మికమైన" ప్రకృతి అంతటా "జడశక్తి" రూపంలో భాసిస్తున్న ఆ తల్లిని గుర్తించగలుగుతాం. నిజానికి సత్యమైన పరమాత్మ, అసత్యమైన జగత్తు రెండూ ఆ తల్లి స్వరూపాలే. అందుకే ఆవిడ "సదసద్రూపధారిణి". అలాగే నశించిపోయే జగత్తు, నాశనం లేని చైతన్యం ఆ తల్లి రూపాలే - "క్షరాక్షరాత్మికా". వ్యక్తంగా మనకు కనపడే ఈ జగత్తు, అవ్యక్తంగా అంతటా నిండియుండి కనపడకుండా దీనిని నడిపిస్తున్న పరమాత్మ శక్తి, రెండూ అమ్మ రూపాలే - "వ్యక్తావ్యక్తాా".

ఆ అమ్మ నిజ తత్వాన్ని ఈ విధంగా భావిస్తూ ఎవరైతే తమ ధ్యానాన్ని, సాధనను పరిపూర్ణం చేసుకుంటారో వారు ఆ అమ్మ స్వరూపాన్నే పొందుతారు. ఎందుకంటే ఆ తల్లి "ధ్యానధ్యాతృధ్యేయరూపా" - అంటే ధ్యాన ప్రక్రియ, ధ్యానం చేసే వ్యక్తి, ధ్యానం చేయబడే వస్తువు మూడూ ఆ అమ్మ రూపాలే.