11, ఫిబ్రవరి 2024, ఆదివారం

అనాయాస మరణం

 అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం

దేహాన్తే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే||

    ప్రతి మానవుడు తప్పకుండా కోరుకోవలసిన కోరిక ఇది. బ్రతికినన్నాళ్ళు ఎవరి మీదా ఆధారపడకుండా బ్రతకడం, మరణ సమయంలో ఎక్కువగా కష్టపడకుండా సునాయాసంగా మరణించడం, ఆ తరువాత పరమేశ్వరునిలో సాయుజ్యం చెందడం, ఇంతకన్నా కోరుకోదగినది ఏమి ఉంటుంది?

            జన్మకు వచ్చిన ప్రతి జీవికి ఆరు అవస్థలు ఉంటాయి. వీటినే షడ్భావ వికారాలు అంటారు. అవి - అస్తి, జాయతే, వర్ధతే, పరిణమతే, అపక్షీయతే, నశ్యతే. ముందుగా తల్లి గర్భంలో ఉండటం - అస్తి. ఆ తరువాత జన్మించడం - జాయతే. ఇక అలా జన్మించిన వ్యక్తి ముందు పెరుగుతాడు(వర్ధతే), ఆ తరువాత మధ్య వయస్సులో శరీరం అనేక మార్పులు చెందుతుంది(పరిణమతే). ఆ వయసు దాటిన తరువాత మెల్లగా శరీరంలోని పటుత్వం, అలాగే చూపు, వినికిడి, నడక ఇలా ఒక్కొక్క అవయవం క్షీణించడం మొదలుపెడుతుంది(అపక్షీయతే). చివరికి ఈ శరీరం పడిపోతుంది(నశ్యతే).

        పుట్టడం, పెరగడం, మార్పు చెందడం ఎంత సహజమో మరణించడం కూడా అంతే సహజమని మనందరికీ తెలిసినదే కదా! అయితే గర్భిణీ అయిన ప్రతి స్త్రీ తనకు సహజ ప్రసవం జరగాలని కోరుకుంటుంది కదా. కొంతకాలం క్రితం వరకు డబ్బులకోసం అవసరం లేకపోయినా ఆపరేషన్లు చేసిన డాక్టర్లు కూడా ఇప్పుడు సహజ ప్రసవమే తల్లికి, బిడ్డకు మంచిదని, తల్లిపాలే బిడ్డకు అత్యుత్తమమని, అలాగే మనందరం సహజంగా పండిన ఆహారాన్నే తీసుకోవాలని ఇలా చెబుతున్నారు కదా.

        ఇలా పుట్టుకనుంచి జీవితంలో ప్రతి విషయంలో సహజత్వాన్ని ఎలా కోరుకుంటున్నామో మరణం విషయంలో కూడా అలాగే సహజ మరణాన్ని కోరుకోవాలి. వెనకటి కంటే వైద్య సదుపాయాలు బాగా పెరిగిపోయిన ఈ రోజుల్లో మృత్యువు అంచులలో ఉన్నవారిని, ఇంకా మరణించిన వారిని కూడా ఏదో ఒక పద్ధతిలో బ్రతికించాలని, వారి ఆయుష్షును పొడిగించాలనే ఆరాటం ఎక్కువ అయిపోయింది. ఇంకా జీవితం సరిగ్గా అనుభవించని యువకులు, లేదా బాధ్యతలు తీరని మధ్య వయస్కుల విషయంలో అనుకోని ఆపద, లేదా వ్యాధి ఎదురై మరణించే పరిస్థితి వచ్చినపుడు ఇలా ఆరాట పడటాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.

        కానీ నిండు జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించిన పెద్దవారు తాము కట్టకొన్న ఇంటిలో తన వాళ్ళందరూ చుట్టూ ఉండగా, ఆనందంగా, సహజంగా దేహాన్ని వదిలిపెట్టాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా! ఇక దేహాన్ని వదలివేయడం తథ్యం అన్న పరిస్థితులలో కూడా వారిని ఐసియూలో పెట్టి వంటినిండా సూదులు, గొట్టాలు గుచ్చి చుట్టూ తనవాళ్ళు అంటూ ఎవరూ కనబడని నిస్సహాయ స్థితిలో మరణించేలా చేయడం ఎంతవరకు సమంజసం? మనం ప్రేమించేవాళ్ళు ఎల్లకాలం మనతోనే ఉండాలని ప్రతివారు కోరుకుంటారు. అయితే దానికి కూడా పరిమితులు ఉంటాయి కదా. వయసుకు వచ్చిన పిల్లలు మనను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవడం ఎంత సహజమో, వయసు అయిపోయిన పెద్దవారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం కూడా అంతే సహజం. 

        అయితే ఎవరైనా పెద్దవారు ఇంట్లో సహజంగా మరణించారంటే ఈ చుట్టూ ఉన్న సమాజం చూస్తూ ఊరుకోదు. ఒక్కొక్కరూ పలకరింపుగా వచ్చి ఆ పిల్లలను "అయ్యో పెద్ద డాక్టరుకి చూపించక పోయారా?" "ఎకో టెస్టు చేయించాల్సింది." "లేదు, ట్రెడ్మిల్ టెస్టు చేస్తే కానీ ఇలాంటివి బయటపడవు" అని ఇలా సలహాలు ఇస్తున్నట్లుగా సూటిపోటి మాటలతో తామేదో లోటు చేశామనే అపరాధ భావనను ఆ పిల్లలలో కలిగిస్తారు. ఈ పోరు తట్టుకోలేక, ఇటువంటి పరిస్థితిని చూసినవారు రేపు తమ ఇంటిలో పెద్దవారిని ఏ చిన్న రోగం వచ్చినా నానా రకాల వైద్యాలు చేయించి చివరికి ఏ ఐసీయూలోనో మరణించే పరిస్థితిని కల్పిస్తారు.

    మరణం ఏ విధంగా సంభవిస్తుంది అనేది మన చేతిలో లేదు. ఈ శరీరం ప్రారబ్ధం అనుభవించడానికి వచ్చినది. అది తీరగానే పడిపోతుంది. కొంతమందికి ముందుగానే ఆ ప్రారబ్ధం తీరిపోయి ఏ నిద్రలోనో అనాయాస మరణం సంభవించవచ్చు. మరికొంత మందికి చివరివరకూ తీరక విపరీతమైన మరణవేదన అనుభవించవలసి రావచ్చు. ఏదైనా ఈశ్వర సంకల్పమే. అయితే పైన చెప్పుకున్నట్లు ఆ మరణం సహజంగా తన ఇంటిలో తన వారి మధ్య జరగాలని ప్రతి వ్యక్తి కోరుకోవడంలో తప్పు లేదు కదా! 

         అయితే తాను మరణించిన తరువాత తన పిల్లలు ఇలా సూటిపోటి మాటలకు గురై ఏదో లోటు చేశామనే అపరాధ భావనకు లోను కాకుండా తాను తృప్తిగానే జీవితాన్ని ముగించానని వారు కూడా సంతోషపడేలా చేయడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. నిజంగా మరణ సమయం ఆసన్నమయినపుడు తాను తెలివిలో ఉంటాడో, అపస్మారక స్థితిలో ఉంటాడో తెలియదు కదా. అందువలన వారు ఎటువంటి మరణాన్ని కోరుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకొని, తన సంతానానికి, స్నేహితులకి ఒకటికి రెండు మూడుసార్లు తెలియజెబితే, తాను ఏ స్థితిలో ఉన్నా తృప్తిగా తన ఇంటిలోనే, తనవారి మధ్యలో సహజంగా శరీరాన్ని వదిలి శివ సాయుజ్యాన్ని పొందుతాడు.

23, డిసెంబర్ 2023, శనివారం

వైకుంఠ ఏకాదశి

 శ్రీమహావిష్ణువు శయనైకాదశి(ఆషాఢ శుద్ధ ఏకాదశి) నాడు యోగనిద్రలోకి వెళతాడని మన పెద్దలు చెబుతారు. అప్పటినుండి నాలుగు నెలలు మహాత్ములు అందరూ చాతుర్మాస్య వ్రతం చేస్తారు.  శయనైకాదశి అయిన రెండు నెలలకు విష్ణుమూర్తి నిద్రలోనే ఇటునుండి అటు తిరుగుతాడని, దానిని పరివర్తన ఏకాదశి(భాద్రపద శుద్ధ ఏకాదశి) అంటారు. మరో రెండు నెలల తరువాత ఆయన నిద్రనుండి లేచే ఉత్థాన ఏకాదశి(కార్తీక శుద్ధ ఏకాదశి) వస్తుంది. దీనినే క్షీరాబ్ధి ఏకాదశి అని, చిలుక(చిలుకు) ఏకాదశి అని కూడా పిలుస్తారు. సాగర మథనం (సముద్రాన్ని చిలకడం) ఆ రోజే ప్రారంభమైనదని చెబుతారు. ఆ తరువాత ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని(అది మార్గశిర మాసం కావచ్చు, లేదా పుష్య మాసం కావచ్చు) వైకుంఠ ఏకాదశి, లేదా ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటాం.

    ఈరోజు శ్రీమహావిష్ణువు వైకుంఠపు ఉత్తరద్వారాలు తెరచి దర్శనమిస్తారని, ముక్కోటి దేవతలు ఆ అరుదైన దర్శనానికి వైకుంఠానికి చేరుకుంటారని ప్రతీతి. అయితే మనం దేవతల కాలమానాన్ని కొద్దిగా గమనిస్తే, చద్రమండలంలో ఒక రోజు అంటే మనకి ఒక నెలతో సమానం. అలాగే సూర్య మండలంలో ఒక రోజు మనకు ఒక సంవత్సరం. అలా పైకి వెళ్ళినకొద్దీ కాలప్రమాణం పెరుగుతూ పోతుంది. బ్రహ్మదేవుడికి ఒక క్షణం అయితే మనకు ఒక సంవత్సరం అవుతుంది. మరి అంతకంటే పై స్థాయిలో ఉండే విష్ణుమూర్తికి మన ఒక సంవత్సరంలోనే నిద్ర, మెలకువలతో కూడిన రోజు పూర్తి అయిపోవడమంటే కొంచెం ఆశ్చర్యంగానే తోస్తుంది.

    కొంచెం లోతుగా ఆలోచిస్తే నిజానికి ఇవన్నీ మన సాధనలోని దశలని అనిపిస్తాయి. వ్యాపకత్వం విష్ణువు లక్షణం. ఆయన విశ్వమంతటా వ్యాపించి ఉంటాడు. అలాగే మన శరీరంలో అంతటా వ్యాపించి ఉండేది మనస్సు. ఉత్ అంటే ఎత్తు, లేదా పైన. మనం మ్యాపులో చూస్తే పైన ఉండే దిశను ఉత్తరం అంటాం కదా. ఉత్తరం అంటే నువ్వు చూస్తున్న వాటిలో మిగిలిన వాటికంటే పైన ఉండేది. ఉత్తర ద్వారం అంటే సహస్రార చక్రమే. అసలు అన్నిటికంటే పైన ఉండేది ఉత్తమం. సనకాది మహర్షులు జ్ఞానతృష్ణతో ఉత్తరదిశగా ప్రయాణిస్తుంటే అక్కడ దక్షిణాభిముఖుడై పరమేశ్వరుడు గురురూపంలో దక్షిణామూర్తిగా వారి ఎదుట ప్రత్యక్షమై తన మౌన వ్యాఖ్యతోనే పరబ్రహ్మ తత్వాన్ని ప్రకటితం చేస్తారు. అలా గురుమూర్తి ఉత్తర భాగంలో, అంటే తనకంటే పై స్థాయిలో ఉండి చేసిన బోధను అందుకొని సాధకుడు తన యోగసాధనను ప్రారంభిస్తాడు. అదే శయనైకాదశి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేన్ద్రియాలను నిగ్రహించి వాటికి అధిపతియైన పదకొండవది అయిన మనస్సుతో చేసేది సాధన. అందుకే ఇవన్నీ ఏకాదశులు.

    ఇలా సాధన మొదలు పెట్టిన సాధకుడి మనస్సు మెల్లగా పరివర్తన చెంది ప్రపంచాభిముఖంగా ఉండేది పరమాత్మకు అభిముఖంగా తిరుగుతుంది. అదే పరివర్తన ఏకాదశి. సాధన మరికొంత ముందుకు సాగుతున్న కొద్ది ఆ వ్యక్తి తాను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎగబ్రాకుతాడు. చివరికి బ్రహ్మజ్ఞానోదయం అవుతుంది. అలా బ్రహ్మజ్ఞానమునందు మేల్కొనడమే ఉత్థాన ఏకాదశి. అలాగే సాధనలో మన మనస్సును చిలికి అందులోని మంచి, చెడు విషయాలనన్నింటిని బయటకు తీసివేసినప్పుడు చివరికి బ్రహ్మామృతం లభిస్తుంది. అందుకే ఇది చిలుకు ఏకాదశి కూడా. ఇప్పుడు తాను బ్రహ్మమునని, ఈ జగత్తుకంటే ఉన్నతమైన స్థితిలో (దానికి ఉత్తరభాగంలో) ఉన్నానని అనుభూతిలోకి తెచ్చుకుంటాడు. అలా 'అహం బ్రహ్మాస్మి' అని అనుభవంలోకి తెచ్చుకున్న తరువాత మరి జగత్తు ఏమవుతుంది? తాను మాత్రమే బ్రహ్మ కాదు కదా! బ్రహ్మమంటేనే సర్వవ్యాపకమైనది. అంటే 'సర్వం ఖల్విదం బ్రహ్మ' అని గ్రహిస్తాడు.

    విష్ణు సహస్రనామాలలో మొట్టమొదటిది 'విశ్వం', రెండవది 'విష్ణుః'. అంటే ఈ విశ్వమంతా విష్ణువే. ఈ అనుభవాన్ని పొందడమే ఉత్తరద్వార దర్శనం. దీనిని ఉత్తరద్వారం అన్నారు కానీ ఉత్తమద్వారం అనలేదు. ఎందుకంటే అది పైన ఉంది కానీ, అన్నిటికంటే పైన కాదన్నమాట. ఎందుకంటే ద్వారం అంటేనే దానిలోనుంచి ఇటూ అటూ వెళ్ళే వీలు ఉంటుంది కదా. అంటే ఆ ద్వారానికి ఇంకా పైన (ఇంకా ఉత్తరంలో) ఏదో ఉంది అన్నమాట. సరిగ్గా అక్కడే ఈ ముక్కోటి దేవతలు విష్ణుదర్శనం కోసం నిరీక్షిస్తూ ఉంటే స్వామి సాక్షాత్కరిస్తారు. ఇప్పుడు చూస్తే దేవతలందరూ ఉత్తరభాగంలో దక్షిణం వైపు తిరిగి ఉన్నారు, విష్ణుమూర్తి దక్షిణభాగంలో ఉత్తరంవైపు తిరిగి ఉన్నారు. మొదట మనం చెప్పుకున్న దక్షిణామూర్తి ఉత్తరభాగంలో దక్షిణం వైపు తిరిగి ఉంటే ఋషులు దక్షిణభాగంలో ఉత్తరంవైపు తిరిగి ఉన్నారు.

    మళ్ళీ మన సాధన విషయానికి వస్తే, ప్రపంచానికంటే క్రింది స్థితిలో ఉండి, దానిచే నిత్యం బాధింపబడుచున్న సాధకుడు ఉన్నత స్థితిలో ఉన్న గురుదేవుల ఉపదేశంతో సాధన ప్రారంభించి, పరివర్తన చెంది, తనను ఈ ప్రపంచం బంధించలేదని, తాను దానికంటే ఉన్నతుడైన బ్రహ్మవస్తువునని తెలుసుకుని, ఇప్పుడు క్రిందికి(దక్షిణానికి) తిరిగి చూస్తే తనకు విశ్వం ఉండవలసిన స్థానంలో విష్ణుమూర్తి కనిపిస్తాడు. ఇదే ఉత్తరద్వార దర్శనం. ఇట్టి అత్యుత్తమ స్థితిలో స్థిరంగా కూర్చున్న వ్యక్తి (ఉత్ + ఆసీన = ఉదాసీన) సర్వాన్ని సమదృష్టితో చూస్తాడు. నేలమీద నడిచేవానికి ఒకరు లావుగా, ఒకరు సన్నగా, ఒకరు ఎత్తుగా, ఒకరు పొట్టిగా ఇలాంటి భేదాలన్నీ కనిపిస్తాయి కానీ ఎత్తైన పర్వతశిఖరం మీదనుంచో, విమానంలోనుంచో చూసేవాడికి ఏ భేదాలైనా కనిపిస్తాయా? అంతా ఏక స్వరూపంగానే కనిపిస్తుంది. అదే 'సర్వం ఖల్విదం బ్రహ్మ'.

    ఈ ఏకాదశులన్నీ ఒకదానికొకటి రెండేసి నెలల దూరంలో ఉండటం మనం గమనించవచ్చు. అలాగే సాధనలో కూడా మనస్సు నిలబడాలంటే రోజూ కనీసం రెండు గంటలైనా ధ్యానం చెయ్యాలని గురువులు చెబుతారు. అలా సాధన చేసిన సాధకుడికి చివరికి 'నీవె నేనై నేనె నీవై జగంబెల్ల ఏక స్వరూపమై నేనుగా భాసించే బ్రహ్మానందానుభూతిని' గురుదేవులు అనుగ్రహిస్తారు. అప్పుడు నిత్యం వైకుంఠ ఏకాదశే! తాను చూసేదంతా ఉత్తరద్వార దర్శనమే!

13, డిసెంబర్ 2023, బుధవారం

జీవేశ్వరుడు

  

వెంకట్రావుకి భక్తి మెండు. పైగా అతనికి ఎలాగైనా చనిపోయిన తరువాత వైకుంఠానికి చేరుకోవాలని కోరిక. భారతదేశంలో అతడు దర్శించని పుణ్యక్షేత్రం లేదు, నీరాడని తీర్థం లేదు. ఎవరు ఏమి చేస్తే పుణ్యం వస్తుందని చెప్పినా అవన్నీ చేసేవాడు. ప్రతి పుణ్యక్షేత్రంలో తన పేర అన్నదానానికి విరాళాలు ఇచ్చాడు. నలుగురిలో గొప్ప పుణ్యాత్ముడనే పేరు తెచ్చుకున్నాడు. ఇలా ఉండగా చివరికి అతనికి అంత్యకాలం సమీపించింది. అయితే తనను తీసుకుపోవడానికి విష్ణుదూతలు వస్తారని ఆశగా ఎదురుచూస్తున్న వెంకట్రావు ఆశ అడియాసే అయ్యింది. ఎదురుగా యమదూతలను చూసి బిక్కచచ్చిపోయాడు. 


చేసేదేమీ లేక వారితో బయలుదేరాడు. ఆ  ప్రయాణం సుదీర్ఘంగా సాగుతోంది. కొంత సమయం గడిచాక ఎలాగో మెల్లగా ధైర్యం కూడదీసుకొని ఆ యమదూతలతో మాట కలిపాడు. “అయ్యా! నేను నా జీవితమంతా ఎన్నో పుణ్యకార్యాలు చేశాను. గొప్ప పుణ్యాత్ముడిగా పేరు గడించాను. ‘సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్ఛతి’ అని నమ్మి కనబడిన దేవునికల్లా మ్రొక్కాను. ఈ చేసిన పుణ్యకార్యాలకు నారాయణుడు ఎంతగానో సంతోషించి నన్ను వైకుంఠానికి తీసుకెళతాడని నేను విష్ణుదూతలకోసం నిరీక్షిస్తుంటే తీరా మీరు వచ్చారు. దయచేసి నేను చేసిన తప్పేమిటో సెలవిస్తారా?” అని భయపడుతూనే ప్రశ్నించాడు.


దానికా యమదూతలు పెద్దగా నవ్వుతూ “చూడు నాయనా! నువ్వు చెప్పినదంతా నిజమే. నువ్వు చాలా పుణ్యకార్యాలు చేశావు. అయితే అంతకంటే ఎక్కువే పాపాలు చేశావు. అందుకే నిన్ను ముందుగా నరకానికి తీసుకువెళ్ళడం జరుగుతోంది. నువ్వు అనేక పుణ్యక్షేత్రాలు తిరిగావు.  అక్కడి విగ్రహాలలో, నదులలో భగవంతుని చూడటానికి ప్రయత్నించావు, కానీ ఏనాడైనా నీ చుట్టూ ఉన్న మనుష్యులలో, ఇతర ప్రాణులలో భగవంతుడు ఉన్నాడని గుర్తించావా? ఏ క్షేత్రానికి వెళ్ళినా నీ మనస్సు ఎంతసేపూ పూజల చుట్టూ, స్నానాల చుట్టూ తిరుగుతూ ఉండేది తప్ప, అక్కడ నీకు ఎదురైన దీనజనులకు నీ చేతనైన సహాయం చేయడానికి ఎప్పుడైనా ప్రయత్నించావా? పైగా ఎవరైనా సహాయం అర్థిస్తే వారిని అనుమానంతో చూడటమే కాక, చీదరించుకునే వాడివి, గుర్తుందా?


ఎన్నో క్షేత్రాలలో అన్నదానానికి విరాళాలు ఇచ్చావు కానీ, అవన్నీ కేవలం పుణ్యం సంపాదించుకోవడానికే తప్ప అన్నార్తుల మీద జాలితో కాదు. నీ ఇంటికి ఎవరైనా బిచ్చగాడు వచ్చినా వారిని అసహ్యించుకుంటూ, తప్పదని దూరంనుంచే ఎంతో కొంత విసిరివేసేవాడివి కానీ ఇస్తున్నది నారాయణుడికనే భక్తితో, వినయంతో ఎపుడైనా దానం చేశావా? నీ అవసరానికి చెప్పులు కుట్టించుకొని కనీసం అందుకు మూల్యాన్ని అతనికి మర్యాదగా చెల్లించకుండా, నేలమీద విసిరేసి వెళ్లిపోయేవాడివి. ఎందుకంటే అలాంటి వారిని ముట్టుకోవాలంటేనే నీకు అసహ్యం. దివ్య క్షేత్రాలకు వెళ్ళినా అక్కడ సహపంక్తి భోజనాలు చేయడానికి నీకు చిరాకు. నీ ఇంటిలోనే పనిచేసే పని మనుషులను ఏనాడూ మనుషులుగా చూడలేదు.


బంధువులకు, స్నేహితులకు గొప్పకోసం మళ్ళీ మళ్ళీ క్రొత్త బట్టలు పెడుతూ ఉండేవాడివి కానీ, ఎవరైనా లేనివారు వచ్చి ఒక పాత బట్ట ఇవ్వమంటే చీదరించుకునే వాడివి. పెద్ద ఇల్లైతే కట్టుకున్నావు కానీ వర్షానికి భయపడి నీ వసారాలోకి ఏ కుక్కో వస్తే దాని కాళ్ళు విరగగొట్టే వాడివి. ఇలా అనేక దీనజీవుల పట్ల అసహ్యాన్ని ప్రదర్శిస్తూ పాపాన్ని పోగేసుకున్నావు. ‘సర్వ దేవ నమస్కారం కేశవం ప్రతి గచ్ఛతి’ అని నమ్మావు కానీ ‘సర్వ జీవ తిరస్కారం కేశవం ప్రతి గచ్ఛతి’ అని తెలుసుకోలేకపోయావు. నువ్వు నమ్మిన ఆ నారాయణుడే స్వయంగా ‘సర్వస్య చాహం హృది సన్నివిష్టః’, ‘ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి’ అని చాటి చెప్పాడు కదా! భగవంతుడికి తనకు పూజలు చేసే వారికన్నా ఇతర జీవులకు సేవ చేసేవారు అంటేనే ఎక్కువ ఇష్టం. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి వచ్చే జన్మలోనైనా సర్వ జీవకోటిలో ప్రకాశిస్తున్న జీవేశ్వరుని దర్శించి సేవించే ప్రయత్నం చెయ్యి. అప్పుడు నువ్వెక్కడ ఉంటే అదే వైకుంఠం అవుతుంది” అని ప్రబోధించారు.